ఈ పుట ఆమోదించబడ్డది

వాడు. చిన్నప్పుడే అతనికి ఈ దేశంలో పెద్దపెద్ద పరిశ్రమలు సాగించాలని ఉండేది. పెద్దవాడయ్యాక వాటికోసం అనేక ప్రయత్నాలు చేసి కొంత డబ్బు ఖర్చుపెట్టాడు. రాజమహేంద్రవరానికి అతను మహత్తరమైన సేవ చేశాడు. అతని ఆత్మకి శాంతి కలుగుగాక!

నాకు ఇంకా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే చిట్టూరి సూరయ్య ప్రభృతులు స్ఫురణకి వస్తున్నారు. వాళ్ళందరిని గురించీ వ్రాయడానికి ఈ సందర్బంలో అవకాశంలేదు కాని, లేకపోతే వ్రాసేవాణ్ణే. వాళ్ళలో ఎవళ్లైనా జీవించి ఉంటే దీనికి అన్యథా భావించరని నమ్ముతున్నాను. మొత్తంమీద, ఆప్తులైన స్నేహితుల మధ్య వాళ్ళందరకీ ఇష్టుడుగా ఉంటూ కులాసాగా విద్యార్థి దశ పూర్వభాగం గడిపివేశాను.

ఇంక కాలేజీచదువు మాట, 1890 ఫిబ్రవరిలో రాజమహేంద్రవరం ఆర్ట్సుకాలేజీలో యఫ్. ఏ. క్లాసులో జేరాను. మళ్ళీ ఆ కాలేజీలో చేరడానికి కారకుడు హనుమంతరావు నాయుడుగారే! తమజీతం 30 రూపాయిలే అయినా, ఒక పెద్దకుటుంబం భరించవలిసి వచ్చినా, మరి ఎల్లాగ తంటాలు పడేవారో ఆయనకే తెలియాలి! ఆ పరమేశ్వరుడికే తెలియాలి! నేను "ఈ చదువు గట్టెక్కడం ఎల్లాగ?" అని ఆత్రత పడుతూంటే ఆయన ఎల్లాగో డబ్బు సంపాదించి ఇస్తూ ఉండేవారు. యఫ్. ఏ. లో ప్రవేశించడానికి కావలసిన జీతంకూడా అల్లాగే ఇచ్చారు; దానికి ఆయన ఇంట్లోవాళ్ళు సహజంగా కొంత బాధపడే వాళ్ళు. ఆయన భార్య లక్ష్మమ్మగారు మాత్రం మహాఇల్లాలు. హనుమంతరావు నాయుడుగారు నన్ను తన బిడ్డలకంటె కూడా ఎక్కువగా ఆదరిస్తూ ఉంటే, ఆమె కొంచెం అయినా బాధపడేది కాదు. నాయుడుగారి తల్లి కొంత మమకారంతో ఏదో బాధపడేది కాని నాయుడుగారు లెఖ్ఖపెట్టేవారు కారు; వాళ్ళకి ఏదో విధంగా సమాధానం చెప్పేవారు. ఆయనా నేనూ కలుసుకున్న వేళావిశేషం ఎట్లాంటిదోగాని ఆయనకి నే నంటే అంత వాత్సల్యం ఉండేది.

అప్పట్లో, మా కాలేజీ పరిస్థితులు కొంచెం వ్రాస్తాను. కాలేజీ ప్రిన్సిపాల్ మహావిద్యావేత్త అయిన మెట్కాఫ్. ఒక్క రాజమహేంద్ర