పుట:Naajeevitayatrat021599mbp.pdf/611

ఈ పుట ఆమోదించబడ్డది

లోపలికి వెళ్ళేసరికి దండం పెట్టి "గురువుగారూ!" అంటూ కోటు జేబులు రెండింటిలోంచి రెండు మామిడి పళ్ళుతీసి ఆఫీసుబల్లపై పెట్టాడు. "ఏమిటండీ?" అని ప్రకాశంగారు అడిగేలోపున పంట్లాం జేబులు రెంటిలోంచి మరి రెండు మామిడిపండ్లు తీసి బల్లపై పెట్టాడు. అతని వైఖరిలో కొంత వెర్రితనం కనిపిస్తున్నది. "ఏమిటయ్యా విషయం?" అనేసరికి, తన బ్రీప్‌బేగ్‌లో ఉన్న మరో రెండు మామిడి పండ్లు తీసి బల్లపై పెట్టాడు.

"ఇదంతా ఏమి?"టని గట్టిగా ప్రశ్నిస్తే, "గురువుగారూ! ఆ తురకవాడు నన్ను బతక నివ్వడండి," అన్నాడు. అది వినగానే అతడు నెల్లూరు ట్రెజరీ డిప్యూటీ కలెక్టరు అయివుంటాడని గ్రహించ గలిగాను. అతడు జిల్లాకలెక్టరు ట్రావెలింగు ఎలవెన్సు విషయమై పెట్టిన అభ్యంతరాలు, వాటికి కలెక్టరు ఇచ్చిన సంజాయిషీ, డిప్యూటీ కలెక్టరు అవకతవక మనిషి అన్న బోర్డు రిపోర్టు మొదలైన కాగితాలున్న పైలు, మేము అంతకు రెండు మూడు రోజులక్రితం చూడడం తటస్థించింది. నేను వెంటనే "నాయుడుగారూ! మీరు ఇలా మంత్రిగారిని నేరుగా చూడడానికి వస్తే, మీ నిబంధనలు ప్రకారం మీపైన ఇంకోనేరం రాదుగదా!' అంటే, వెంటనే అతడు "నే నిక్కడికి వచ్చినట్టు అక్కడ ఏం రికార్డుంటుందండీ?" అని ప్రశ్నించాడు. ప్రకాశంగారు, నేను అనుకోకుండా పెద్దగా నవ్వుకున్నాము. మే మిలా మాట్లాడుతుండగానే, అతడు ప్రభుత్వం తాలూకు కలాలు, పాళీలు దుర్వినియోగం చేస్తున్నాడని కలెక్టరు అతనిపై పెట్టిన ఛార్జీ ఫైలు బంట్రోతు తెచ్చి, అక్కడున్న ఫైళ్ళకట్టలపై పెట్టడం జరిగింది. ఫైలురాగానే దాని ముఖపత్రం చూడడం ఏ ఉద్యోగికైనా, మంత్రికైనా అలవాటు. తీసి చూసేసరికి అది ఈ డిప్యూటీ కలెక్టరు పాళీలఫైలు.

"ఏమిటి నాయుడుగారూ, ఈ పాళీల వ్యవహారం?" అని ప్రకాశంగారు నవ్వుతూ అడిగారు.