పుట:Naajeevitayatrat021599mbp.pdf/601

ఈ పుట ఆమోదించబడ్డది

చేసే అపచారాలు తగ్గించడానికి వీలుగా కార్యనిబంధనలు మార్చడానికి కూడా రాజాజీకి మనస్కరించకపోవడం వల్ల వీరిద్దరి మధ్యను ఎప్పుడూ ఏదో రగుల్కొంటూనే ఉండేది. ఇటువంటి యిబ్బందుల విషయం పైవారికి తెలియకుండా ఉండడానికి, కలిసికట్టుగా మంత్రివర్గం నడుస్తున్నదని చెప్పేందుకు వీలుగా ప్రకాశంగారు సర్దుకొనిపోతూ ఉండేవారు. మంత్రివర్గం పని ఆరంభించిన వెంటనే ప్రకాశంగారిని ఎదుర్కొన్న సమస్యలలో ఒకటి - విజయనగరం రాజాకూ, కోర్టు ఆఫ్ వార్డ్సుకూ మధ్య ఉన్న విపరీతమైన తగాదా.

విజయనగరం రాజా చెన్న రాష్ట్రంలోని జమీందార్లందరిలోనూ పెద్ద జమీందారు. అకలంకమైన జాతీయవాది. బ్రిటిషు గవర్నమెంటువారు మన దేశంలో చేస్తుండే అన్యాయాలను విమర్శిస్తూ, మన స్వరాజ్యం మనకు అప్పజెప్పవలసిన బాధ్యత వారియందున్నదంటూ ఆయన పత్రికలలో అనేక వ్యాసాలు వ్రాశారు. ఏ పెద్ద జమీందారూ సాహసించి అటువంటి పనికి పూనుకోలేదు. అందుచేత గవర్నమెంటువారికి ఈయన పైన నిఘా ఉండేది. ఏదో గృహ సంబంధమైన వివాదాన్ని పురస్కరించుకొని, ఈయన తన విషయం కూడా తాను ఆలోచించుకోలేడనీ, సంరక్షణ చేసుకోలేడనీ ఏవో సాకులు చూపుతూ - ఆయన ఎస్టేటునేగాక, వ్యక్తిగా ఆయనను కూడా తమ సంరక్షణలోనికి తీసుకుంటూ ఒక ప్రకటన చేశారు. అంటే, ఆ ప్రకటన తర్వాత ఆయన ఒక మైనరుతో సమానమైనాడన్న మాట.ఇది చాలా అమానుషమైనది. ఈ ఆర్డరు 1935 లో జారీ అయింది. 1937 లో కాంగ్రెసు పక్షాన ఆయనను అభ్యర్థిగా నిలబెట్టేందుకు కాంగ్రెసువారము నిశ్చయించాము. అయితే, ఆయన కాంగ్రెసు పేరునగాక, స్వతంత్రమైన అభ్యర్థిగా ఉండునట్లు ఏర్పాటు జరిగింది. మిగిలిన వ్యవహారాలకు ఆయన కాంగ్రెసు సభ్యునితో సమానము.

ఎన్నికల తర్వాత వెంటనే మంత్రివర్గం ఏర్పాటు చేయలేదని ఇదివరలో చెప్పడమైనది. ఆ మధ్యకాలంలో ఇంటెరిమ్ మినిస్ట్రీ అనే పేరున ప్రభుత్వంవారు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఓడి