పుట:Naajeevitayatrat021599mbp.pdf/600

ఈ పుట ఆమోదించబడ్డది

ఒక్కొక్కప్పుడు మంత్రులు కాంగ్రెసు సూత్రాల ప్రకారంగా ముఖ్యమనుకొనే విషయాలలో కూడా ఇదే విధంగా జరుగుతుండేవి.

కార్యదర్శులు ప్రజల వోట్లు పుచ్చుకొని వచ్చినవారు కాక, కేవలం ఉద్యోగస్థులు కావడం చేతను, ఏ శాసనాల ప్రకారంగానూ వారికి ఈ విధాన సభలు హక్కు లివ్వకపోవడం చేతను, ప్రభుత్వం నడిపించడానికి అవసరమైన అధికారాలను కార్యదర్శులకు సంక్రమింప చేసే శాసనం లేకపోవటంవల్లను - కార్యదర్శులు తుది నిర్ణయాలు చేసి, మంత్రులకు తెలియనక్కర లేకుండా పరిపాలించే విధానం మంచిది కాదని ప్రకాశంగారు గట్టిగ దెబ్బలాట ఆరంభించారు. మంత్రుల సంఖ్య చాలకపోయినట్లయితే మంత్రి మండలిని విస్తృతపరచాలి. దానికి తోడు పార్లమెంటరీ కార్యదర్శులకు అధికారాలు సంక్రమింప చేయవచ్చని వారి ఊహ.

సచివాలయం సంపూర్ణంగా దీనికి వ్యతిరేకంగా ఉండేది. అందుచేత, రాజాజీ కూడా సంపూర్ణంగా వ్యతిరేకులైరి. అనగా మంత్రి మండలిలో మరో ఇద్దరో, ముగ్గురో మంత్రులు తప్ప, మిగిలినవారు ప్రకాశంగారి వాదానికి వ్యతిరేకులైరి. రానురాను, ప్రకాశంగారు కూడా ఈ ప్రసక్తి మెల్లమెల్లగా వదలిపెట్టారు. కాని, కొంతకాలం రాజాజీకి, ఈయనకూ మధ్య చాలా వాదులాటలు సాగినాయి.

విజయనగరము మహారాజా కేసు

జబ్బుతో ఉన్న విజయనగరం రాజా, తన ఎస్టేటు కోర్టు ఆఫ్ వార్డ్సు చేతిలో ఉన్న కారణంచేత, తనకు మూడువేల రూపాయలు మెడికల్ ఎలవెన్స్ ఇవ్వవలసిందని కోరితే, మంత్రికి తెలియకుండానే లేదు పొమ్మన్నారు. తర్వాత, మంత్రి కీ విషయం తెలిసిన మీదట కాగితం తనవరకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తే, కార్యనిబంధనల క్రింద త్రోసివేయడానికి హక్కు తమకుందని ఆ కార్యనింబంధన ఒకటి ప్రకాశంగారికి చూపించడం మొదలు పెట్టారు. విజయనగరం రాజా శాసన సభ సభ్యుడు కూడా. ఇటువంటి సందర్భాలలో, ఈ ఉద్యోగులు