పుట:Naajeevitayatrat021599mbp.pdf/594

ఈ పుట ఆమోదించబడ్డది

ఎన్నికలలో విజయం : అనంతరము

పైన చెప్పిన రెండు స్థానాలు తప్ప మిగినిన స్థానాలన్నీ కాంగ్రెసు వశమయినాయి. ముస్లింలీగ్‌ వారి ప్రత్యేకస్థానాలు మాత్రం కాంగ్రెసువారికి వశం కాలేదు. ఆ సభలోని మొత్తం 215 స్థానాలలో 160 కాంగ్రెసువారికి లభించినాయి.

ఆంధ్రప్రాంతంలోనుంచి ఎన్నికయిన సభ్యులు యావన్మంది చెన్నపట్నంలో 'దేశోద్దారక' కాశీనాథుని నాగేశ్వరరావుగారి యింట్లో సమావేశమయారు. అందరూకూడా ప్రకాశంగారు తప్పకుండా ముఖ్యమంత్రి కాగలరన్న దృఢమయిన అభిప్రాయంలో ఉన్నారు. అయితే ఆ అభిప్రాయం వారి అభిమానాన్ని పురస్కరించుకొని తెచ్చుకొన్నట్టిదే గాని వాస్తవానికి కొంచెం దూరమయినట్టు తర్వాత జరిగిన ఉదంతాలు తేల్చినవి. రాష్ట్ర కాంగ్రెసులో కొంతమంది పెద్దలకు ప్రకాశంగారంటే పడదన్న విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ, ఒక తెలుగు నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే సందర్భంలో భేదాభిప్రాయాల ప్రభావం వ్యతిరేకంగా వుండదని ఒక వెర్రి ఊహ అందరి మనస్సుల్లోనూ వుండేది. "ఇంతకు, పోటీకి ఎదురుగా వున్న వారెవరు? ఏడు సంవత్సరాల క్రితం చెన్నపట్నంలో ఉప్పు సత్యాగ్రహం చేసి, బ్రిటిషు తుపాకీలకు ఎదురుగా నిలబడ్డవారెవరు? చెన్నపట్నంలో ఉప్పు సత్యాగ్రహానికి తగిన వాతావరణం లేదని బ్రిటిషు తుపాకీలకు భయపడి తమిళ నాయకులందరూ దక్షిణప్రాంతంలో వున్న వేదారణ్యానికి పోలేదా? జనరల్ ఎన్నికలలో నిలబడి కష్టపడేందుకు ఇష్టంలేక యూనివర్శిటీకి ప్రత్యేకంగా ఇచ్చిన స్థానంలో వచ్చినవారా ఇప్పుడు తగుదుమని ముఖ్యమంత్రి పదవి తమకు కావాలని అనుకునేవారు?" - అని ఈ విధంగా మనవాళ్లలో వాదోపవాదాలు బయలుదేరాయి. "అసలు గాంధీగారి కిష్టంలేని ప్రకాశంగారు ముఖ్యమంత్రి కావాలని మనమంటే తమిళులు ఎందుకు ఒప్పుకుంటారయ్యా?" అని వాళ్లతో బాటు ఆలో