ఈ పుట ఆమోదించబడ్డది

రిజిష్ట్రారు ఆఫీసులో రెండో గుమస్తాపనికి దరఖాస్తు చేశాను. జీతం 14 రూపాయలు. నేను దరఖాస్తు చేసినట్లుగానే సబ్‌రిజిష్ట్రారుగారు నా దస్తూరీ పరీక్ష చెయ్యాలనీ, తెలివితేటలు చూడ్డం నిమిత్తమై ఒకసారి తనని చూడవలసిందనీ నోటీసు చేశారు. ఆ నోటీసు నా ఆత్మగౌరవానికి భంగకర మని తోచింది. నేను "మెట్రిక్యులేషన్ పాసు అయినట్టు సర్టిఫికెట్టు ఉండగా మళ్ళీ ఈ పరీక్ష ఏమిటి? నీ వుద్యోగం నాకక్కరలేదు పొ"మ్మని జవాబు వ్రాశాను. దాంతో ఆ వుద్యోగం తప్పింది. ఏ మనిషి జీవితంలో నైనా యిల్లాంటి స్వల్పవిషయాలతోనే జీవిత పంథా మారిపోతూ వుంటుంది. బహుశ: ఆనాడు నేను సబ్‌రిజిష్ట్రారు ఆఫీసులో చేరివుంటే ఏమయ్యేవాణ్ణో! చెప్పడం కష్టము.

నేను మెట్రిక్యులేషన్ మొదటి సంవత్సరం చదువుతూ వుండగానే యిక్కడ రౌడీలతో స్నేహం చేస్తున్నాననీ, నాటకాల్లో తిరుగుతున్నాననీ, చదువు గుంటపెట్టి గంట వాయిస్తున్నాననీ మా అమ్మగారికీ, బావగారికీ, బంధువులకీ తెలిసింది. ఈ విషయం మా అమ్మగారిని చాలా బాధపెట్టింది. నాకు వండిపెట్టడానికి వచ్చిన మా అమ్మమ్మగారు కూడా నా అవస్థ చూసి బాధపడుతూ వుండేది. నేను 5 వ క్లాసు చదువుతూ ఉండగానే మా అమ్మమ్మగారు నాకు వివాహం చెయ్యాలని సంకల్పించింది. ఆవంకనైనా దూరాన్ని వున్న నేను అక్కడ ఎక్కడో వుండి పాడైపోకుండా ఇంటికి వస్తానేమో నని ఆమె ఆశ.

నేను రాజమహేంద్రవరం వచ్చాక, మా కుటుంబానికి ఇంకొక ఆపత్తు వచ్చింది. మా పెద్దక్కయ్య జానికమ్మగారు చనిపోయింది. అప్పటికి ఆవిడకి చాలామంది పిల్లలు పుట్టి పోయారు. చివరికి హనుమాయమ్మ అనే పిల్ల ఒక్కర్తే మిగిలింది. ఆవిడ చనిపోయేటప్పుడు మా అమ్మగారిని దగ్గిరకి పిలిచి ఆ పిల్లని ఆవిడ చేతుల్లో పెట్టి పిల్లని జాగ్రత్తగా పెంచమనీ, ప్రకాశాన్ని కిచ్చి పెళ్ళి చెయ్యమనీ చెప్పింది. అందుచేత హనుమాయమ్మ నిచ్చి నాకు పెళ్ళి చెయ్యాలని మా అమ్మగారు ఆత్రతపడింది. కాని రాజమహేంద్రవరంలో నాకు వచ్చిన పేరుప్రతిష్ఠలు విని మా బావగారు మాత్రం నాకు పిల్లని ఇవ్వ