పుట:Naajeevitayatrat021599mbp.pdf/574

ఈ పుట ఆమోదించబడ్డది

గదులు. మెదలడానికి జాగాగాని, పీల్చుకోవడానికి పరిశుభ్రమయిన గాలిగాని మాకు లభ్యం అయ్యేదికాదు. మేము అల్లా ఆ మూసిపెట్టే సెల్సులో ఉంటూన్న రోజులలోనే, ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ కాంట్రాక్టర్ (Mr. Contractor) జెయిలు పరిశీలించడానికి వచ్చాడు. కొంతమంది 'బి' క్లాసు ఖైదీలు తలకు రాసుకోవడానికి నూనె సప్లయి చేయించవలసిందని కోరారు. ఆయన, పెడీలున "నేను మీ కాంగ్రెసు ప్రభుత్వపు ఉత్తరువులనే అనుసరిస్తున్నా" నన్నారు. ఆ దెబ్బ వచ్చి తిన్నగా మా ముఖాలకే తగిలింది. రాయికంటె కూడా ఘనంగా దెబ్బతీసే వేళాకోళం లాంటి వెక్కిరింత అది. డా॥ రాజన్ మాజీ జెయిళ్ళ మంత్రి. ఈ సత్యాగ్రహం సందర్భంగా జెయిలుకు వచ్చినప్పుడు, మన కంటిని మన వేలుతోనే పొడుస్తున్నాడు. చూశావా అన్నాను. మేమక్కడికి స్వయంకృతాపరాధఫలం అనుభవించడానికి వెళ్ళాం (We have gone there to stew in our own Juice).

మా కాంగ్రెసు గవర్నమెంటు కూడా కొన్నికొన్ని సందర్భాలలో జస్టిస్ పార్టీ వారి విధానాల కంటె అధమంగా వర్తించిన సందర్భాలున్నాయి. జెయిళ్ళ పరిపాలనా విధానాలలో మా పద్ధతి చాలా అనుచితంగానే ఉండేది. కొంతకాలం జెయిలు అనుభవాలను పొందిన మీదటనే మేము రాజ్యాంగాన్ని చేపట్టాం. అందువల్ల జెయిళ్ళల్లో రాజకీయ ఖైదీలుగా మేము అనుభవించిన కష్టసుఖాలన్నీ మాకు తెలుసు. నిజానికి ఖైదీలు కూడా జీవించవలసిందే గనుక, మేము కొన్ని క్రొత్త నిబంధనావళులనూ, మార్పులనూ ఖైదీల విషయంలో న్యాయంగా తీసుకు రావలసి ఉంది.

మాజీ మంత్రిపై విసురు

రాజకీయ ఖైదీలకు తలకు చమురు ఇవ్వడం విషయంలో కాంగ్రెసు ప్రభుత్వంవారు ఏమని ఆర్డరు వేశారో నాకు తెలియదు. కాని ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ కాంట్రాక్టర్ చమురు సప్లయికి కాంగ్రెసు ప్రభుత్వం వారిని కోరినప్పుడు, 'మానవుడు బ్రతకడానికి