పుట:Naajeevitayatrat021599mbp.pdf/571

ఈ పుట ఆమోదించబడ్డది

అహింసా విధానానికి అనుగుణంగా నడుచుకోలేకే, గాంధీగారి నినాదాన్ని ఉచ్చరించ నిరాకరించడమూ, దానిని ఉచ్చరించవలదని ఇతరులను బలవంతం చెయ్యడమూ జరిగింది.

ఒకరివెంట ఒకరు

ఇటువంటి మన:ప్రవృత్తితోనే రాజగోపాలాచారిగారు సత్యాగ్రహ కాండ జరిపి, 1940 డిసెంబరులో వెల్లూరు జెయిలుకు వచ్చారు. మేము వెల్లూరు జెయిలులో ఒక నెల మాత్రమే కలసివున్నాము. ఉభయ శాసన సభల తాలూకు కాంగ్రెసు సభ్యులు అనుదినం ఒకరివెంట ఇంకొకరు అల్లా జెయిలుకు వస్తూన్న పరిస్థితిని గ్రహించిన రాజాజీ, గాంధిగారి శాసన ధిక్కార పదక ప్రభావాన్ని గ్రహించి ఆశ్చర్యపోయాడు.

ఒకరోజు నాతో ఆయన, ఎం. ఎల్. ఏ. లు కొందరు జెయిలుకు రావడం గమనించిన కారణంగా, "నీవు అన్ని రకాలవాళ్ల నీ తీసుకువస్తున్నా" వన్నారు. హరిజన ఎం. ఎల్. ఏ. లు ఏ ఒక్కరూ మినహాయింపు లేకుండా అంతా జెయిలుకు వచ్చారు. ఇది కేవలం ఆంధ్రుల విషయంలోనే గాదు నేను అంటున్నది - తమిళులు, మలయాళీలు, కన్నడిగులు ఎందరెందరో జెయిళ్ళకు వచ్చారు. వారూ అధిక సంఖ్యాకులుగానే వచ్చారు.

తమ శారీరక, ఆర్థిక, మానసిక స్థితులను గమనించ కుండా, తమ తమ ఇక్కట్లను లెక్క చేయకుండా ఎం. ఎల్. ఏ. లూ, అఖిల భారత కాంగ్రెసు కమిటీ మెంబర్లూ, ఏ ఒకరిద్దరో మినహాగా అంతా, సత్యాగ్రహ సమరంలో పాల్గొని, జెయిళ్లకు రావడం చూసిన నాకు, వారి అఖండిత దేశభక్తినీ, వారి రకరకాల త్యాగాలనూ తలచి, మనస్సు ఉప్పొంగి పోయింది. శ్రీ వెంకటప్ప నాయుడు, శ్రీ పి. వీరభద్రస్వామి, కందుల వీర రాఘవస్వామి (బారెట్ లా), అనంతపురం హరిజన ఎం. ఎల్. ఏ. వేదారప్ప, మలబారుకు చెందిన చందూ, ఇంకా వందలూ వేలూను. ఎన్ని పేర్లని వ్రాయగలను?