పుట:Naajeevitayatrat021599mbp.pdf/569

ఈ పుట ఆమోదించబడ్డది

గిరిగారు ఆ ఉత్తరంలో తాను ఎన్నో రకాల వ్యాపార సంబంధమయిన తగాయిదాలను అహింసాత్మకంగా ఎల్లా సర్దుబాటు చేయగలిగిందీ వివరిస్తూ, గాంధీగారి నినాదాన్ని ఎందువల్ల విస్మరించాలో తనకు అర్థం గావడం లేదనీ, అందులో ముఖ్యంగా ఆ ఆఖరి వాక్యాలు అహింసా ప్రబోధకంగా ఉండగా వాటిని వదలి వేయడంలో అర్థం లేదనీ స్పష్టంగా వ్రాసేశారు.

ఆ మర్నాడే గిరిగారు సత్యాగ్రహం చేసి, శిక్షను పొంది, వెల్లూరు జెయిలుకు వచ్చి నన్ను కలుసుకున్నారు. ఆ సందర్భంలొ గిరిగారు తనకూ, రాజగోపాలాచారి గారికీ మధ్య మళ్ళీ జరిగిన గ్రంథం అంతా చెప్పారు. గిరిగారు నాతో చెప్పిన విషయాల సారాంశమే పైన వ్రాశాను. చదువరులకు ఇలాంటి విషయాలన్నీ చెప్పడంలో నాకో ఉద్దేశం వుంది. ఈ విషయాలన్నీ గ్రహించందే తిరుచురాపల్లి జెయిలులో జరిగిన ఉదంతం చదువరుల కర్థం కాదు. అందువల్లనే ఇవన్నీ చెప్పాను. మా శిక్షా కాలమంతా తిరుచీ జెయిలులోనే గడచింది. ఒక్క మొట్టమొదటి మాసంలోనే నేను వెల్లూరు జెయిలులో వున్నాను.

16

జెయిల్లో గ్రూపు రాజకీయాలు

1940 నవంబరు 26 న నేను వెల్లూరు జెయిల్లో ప్రవేశించేసరికి, అక్కడ 'ఎ' క్లాసులో, మంత్రిగా పనిచేసిన డా॥ టి. ఎస్. ఎస్. రాజన్, తిరుచీ మ్యునిసిపల్ చెయిర్మనూ - ఎం. ఎల్. ఏ. అయిన పి. టి. తేవరూ వున్నారు. వారు ఉభయులూ తిరుచీ ప్రాంతానికి చెందినవారే. ఇరువురూ అక్కడే సత్యాగ్రహం చేశారు. ఆ ఇరువురిలో శ్రీ తేవరు మొదటివాడు. డా॥ రాజన్ మాత్రం గాంధీగారి సూచనలకు వ్యతిరేకంగా రాజగోపాలాచారిగారి పదకం ప్రకారం వ్రాయ బడిన ఉత్తరాలను "వార్ కమిటీ" మెంబర్లకు అందచేయడంద్వారా సత్యా గ్రహులయ్యారు.