పుట:Naajeevitayatrat021599mbp.pdf/564

ఈ పుట ఆమోదించబడ్డది

గారిని కలుసుకుని, మేము నడపబోయే ఉద్యమ విషయాలు ఆయనతో సంప్రదించి అవసరమగు సలహాలు తీసుకున్నారు.

అప్పటికే గాంధీగారు జాగ్రత్తగా ఆలోచించి, ఈ ఉద్యమంలో పాల్గొని జెయిళ్ళకు వెళ్ళదలచే సత్యాగ్రహులు ఉచ్చరించవలసిన నినాదాలు నిర్ణయించి, సర్వ సన్నద్ధంగా తన పదకాన్ని రూపొందించి ఉంచాడు. గాంధీగారు ఎంచిన నినాదాలు చిన్నవిగానూ, బోధనాత్మకంగానూ, సార్థకమై పనికివచ్చేవిగానూ ఉన్నాయి. గాంధీగారి వినూత్నాభిప్రాయం ప్రకారం, ఏ వ్యక్తి తనకు ఇచ్చవచ్చిన రీతిని ఏవేవో వాగుతూ ఆషామాషీగా వ్యవహరించకూడదనీ, అందరూ అచ్చున బోసినట్లు ఒకే విధమయిన మాటలూ, పాటలూ, నినాదాలూ చేస్తూ ముందుకు నడవాలనీ, ఐడియాలకు వ్యక్తినీ, వ్యక్తికి ఐడియాలనూ పిన్నుచేసి పారేశాడు. ఈ దెబ్బతో ఆయన ఆంగ్లేయులకే కాదు, ప్రపంచవాసులందరికీ తనకు కాంగ్రెసులో ఉన్న పలుకు బడిని, తనయందు ప్రజలకున్న అఖండిత విశ్వాసాన్నీ, ప్రజలలో ఉండే కట్టుబాట్లనీ, క్రమశిక్షణనూ చవి చూపించాడు.

అంత పెద్ద ఉద్యమంలో అంత చిన్న చిన్న నినాదాలా ఉచ్చరించడం అని కూడా ఎందరెందరో తలచారు. కాని గడచిన ఇరవై సంవత్సరాలుగా దేశీయులూ, కాంగ్రెసువారు కూడా తమ ఏకైక నాయకుని ఆజ్ఞలను తు. చ. తప్పకుండా నడచుకునే విధానాన్ని బాగా అలవరచుకున్నారు. అటువంటి పరిస్థితులలో గాంధీగారు తప్ప అన్యులెవ్వరూ దేశాన్ని ఒక్క మాటమీదా, ఒకే త్రాటిమీదా నడపలేరనీ, గాంధీగారిని కాదని ఏ వ్యక్తీ కూడా, ఇంకోరకంగా కార్యక్రమం నిశ్చయించ గలిగినా, ముందుకు ఒక్క అడుగు కూడా వేయలేడని దేశీయులందరూ మనస్ఫూర్తిగా నమ్మేవారు.

రాజాజీ అపహస్యం, పోటీ నినాదాలు

దక్షిణ భారతదేశం ఎప్పుడూ సందిగ్ధ పరిస్థితిలో పడిపోవడం మామూలయింది. ఏ కారణాలవల్ల నయితేనేం, అది ఒక సందిగ్ధ పరిస్థితికే లోనయ్యింది. రాజగోపాలాచారి గారి కారణంగానే ఎప్పుడూ