పుట:Naajeevitayatrat021599mbp.pdf/552

ఈ పుట ఆమోదించబడ్డది

14

వ్యక్తిసత్యాగ్రహోదంతం

1940 - 46 లో నేను తిరిగీ జెయిలుకు వెళ్ళక పూర్వమూ, ఆ తర్వాతా జరిగిన సంఘటనలన్నీ చరిత్రాత్మకమైనవి. జెయిలు అనుభవాలను గురించి వ్రాస్తూన్న ఈ సందర్భంలో ఆ చరిత్రాత్మక ఘటనలకు తావులేదు.[1] నేను ఇక్కడ జెయిలు అనుభవాలను గురించి మాత్రమే వ్రాయదలచాను. దానివల్ల చదువరులు వివిధ సందర్భాలలో నేను జెయిలుకు వెళ్ళినప్పుడు పొందుతూవచ్చిన అనుభవాలను ఒకదాని తర్వాత ఒకటిగా చదివి, సంగతి సందర్భాలు సరిగా గ్రహించగలుగుతారు. ఈ పట్టున పూర్వ చరిత్రంతా పూర్తిగా విశద పరచక పోయినా, అవసరమయినంతవరకూ సూచనప్రాయంగా చెపుతూ, మదరాసురాష్ట్ర పరిపాలనా యంత్రాన్ని రెండున్నర సంవత్సరాలు చేతపట్టిన తర్వాత, మళ్ళీ ఎల్లా తిరిగి జెయిళ్ళలో ప్రవేశించామో, తెలపాలని ఉంది. నన్నూ, నాతో సహజీవనంచేస్తూ వచ్చిన మంత్రుల్నీ, శాసన సభ్యుల్నీ, ఇతర కాంగ్రెసువాదుల్నీ పదే పదే జెయిళ్ళపాలుజేసిన ఆ వింత సన్నివేశాలను గురించి మనవి చేస్తాను.

రెండవ ప్రపంచయుద్దం

రెండవ ప్రపంచయుద్దం 1939 సెప్టంబర్‌ మాసంలో రగుల్కుంది. యుద్ద ప్రారంభ సమయానికి మేమంతా మంత్రులంగానే ఉన్నాం. మన దేశపు ప్రత్యేకమైన అనుమతి వగైరాలతో నిమిత్తం లేకుండా, మనం ఆంగ్లేయులచే పరిపాలించబడుతూన్న కారణంగా, మన దేశీయులు ఆంగ్లేయుల తరపున ఆ యుద్ద జ్వాలలలో తప్పని సరిగా ఇరుక్కున్నారు.

  1. వారు ప్లాను చేసి, వ్రాయడం పడని తరువాతి ఖండంలో "కాంగ్రెసు గవర్న్ మెంట్ - అటుపిమ్మట" అన్న ప్రకరణంలో ఆ విషయాలన్నీ గుదిగుచ్చ దలచారు.