పుట:Naajeevitayatrat021599mbp.pdf/545

ఈ పుట ఆమోదించబడ్డది

పెట్టాడు. ఆయన ఆ కటకటాల ద్వారా మమ్మల్ని చూడగలడు. సూర్యనారాయణరావు, తాను నాకున్న అప్పుల తీర్మానంకోసం రు 300 లు కూడా పుట్టించలేకుండా ఉన్నాననీ, అయినా నా భార్య గనుక ఆమెకున్న హక్కులన్నీ తనకు విలియా వేస్తే, కంపెనీకున్న అప్పు యావత్తూ తనకు రావలసిన అద్దెతో సహా, తాను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాననీ చెప్పాడు.

సూర్యనారాయణరావు చెప్పిందంతా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసింది. కృపానిధీ, ఖాసా సుబ్బారావుగారలు ఎక్కడ ఉన్నారని అడిగాను. వారు బయట ఉన్నారనీ, స్వయంగా మాటలాడి ఉన్న చిక్కులన్నీ నాతో చెప్పడానికి భయపడుతున్నారనీ చెప్పాడు. ఆయన తన లాయర్లు, నా భార్యకున్న హక్కులన్నీ తన పేర వ్రాసి ఇచ్చే పక్షంలో, సహాయం చెయ్యవచ్చు నన్నారని అన్నాడు.

ఆమె హక్కులన్నీ విలియా వెయ్య నవసరంలేదనీ, తనపేర సబ్ మార్ట్‌గేజ్‌గా తన హక్కులను ఇస్తే చాలునని నేను చెప్పాను. ఆయన తన ప్లీడర్లు తనకు ఇచ్చిన సలహా ప్రకారంగా గాక ఇంకే విధంగానూ సహాయం చేయజాలనని చెప్పేశారు. నేను నా వద్ద కలం కాగితం కూడా లేవనీ, సంగతులు పరిశీలించి నా భార్యపేర ఉత్తరం వ్రాస్తాననీ చెప్పాను. ఆయన తనవద్ద కాగితం వగైరా లున్నాయని చెపుతూ, ఒక జేబులోనుంచి కాగితం తీసి ఇచ్చాడు.

ఆయన చెప్పిన విషయంలో నాకు పూర్తిగా నమ్మకం కుదరక పోయినా, ఆయన చెప్పిన పరిస్థితులన్నీ విషమ పరిస్థితులుగానే ఉన్నాయనీ, తొందరగా వాటి విషయం తేల్చుకోక పోతే పరిస్థితులు చెయ్యిదాటి పోతాయేమోనని తలచి, నేను నా భార్యపేర ఉత్తరం వ్రాయడానికి అంగీకరించాను. తీర్చవలసిన బాకీల విషయం ఆలోచించి ఇరవై వేలకంటె బాకీ లుండవని చెప్పాను.

ఆమెకున్న హక్కులన్నీ తనపేర ఆమె నామకహా విలియా వేస్తే, దానిని ఒక బినామీ వ్యవహారంగానే భావిస్తూ, తాను ఆ కాగితం