ఈ పుట ఆమోదించబడ్డది

మహేంద్రవరం ఎందుకు వచ్చానో జ్ఞప్తికి తెచ్చుకుని ప్రైవేటుగా మెట్రిక్యులేషన్ చదివిపాసయ్యాను.

ఈ సందర్భంలో సాధారణంగా లోకదృష్టిలో నాటకాలు నా జీవితానికి చేసిన మంచిచెడ్డలు చర్చించడం చాలా అవసరము. నాయుడుపేటలోనూ, ఒంగోలులోనూ ఉన్నప్పుడు నాటకాలవృత్తి నన్ను ఒక విధంగా చిన్నతనపు చిలిపిచేష్టలనించి తప్పించింది. కాని, ఆకతాయులతో సాహచర్యం కలిగింది. నా జీవితప్రారంభం నించేకూడా బహుశ: ఒక అదృష్టం నన్ను వెంటాడిస్తోందని చెప్పాలి. స్నేహాలవల్ల, సాహచర్యాలవల్ల జీవితం అధ:పాతాళంలోకి పడిపోయే పరిస్థితులలో పడడమూ, మళ్ళీ వాటిల్లోనించి దైవికంగా తప్పుగుని బయట పడడమూ జరుగుతోంది. అదే ఈ నాటకాల ప్రకరణంలో కూడా జరిగింది. రాజమహేంద్రవరం నాటకాలలో కూడా ఇదే జరిగింది. ఈ నాటకాలలో అభినయనైపుణ్యం చూసి పేరుపొందిన పెద్దలంతా, మన్నించి, హర్షించేవారు.

మేము ఆ రోజుల్లో ప్రస్తుతం టౌనుహాలుకు తూర్పున ఉన్న పెద్ద ఖాళీస్థలంలో తాత్కాలికంగా ఒక పెద్ద నాటకపు హాలు నిర్మించాము. ఒకసారి మేము అందులో నాటకం ఆడుతూవుంటే, సుప్రసిద్ధన్యాయవాదులై, కాంగ్రెసు అధ్యక్షపదవి అలంకరించిన పి. ఆనందాచార్యులుగారు వచ్చి చూశారు. ఆయన అప్పుడు పిఠాపురంవారి కేసు సందర్భంలో వచ్చారు. అప్పుడు నా అభినయానికి మెచ్చి ఏదో బహుమతీ కూడా ఇచ్చారు. ఆ మెప్పు అల్లా వుండగా ఆ సంవత్సరం 1887 లో మెట్రిక్యులేషన్ తప్పించి! క్రమంగా రౌడీలతో స్నేహం చేసి కొట్లాటలు, కక్షల్లో పడ్డాను.

ఇంతకన్నా ప్రమాదమైనది నా నైతికప్రవర్తన. నేను నా అభినయంవల్ల నాకు తెలియకుండానే కొందరు అమాయికస్త్రీల మనస్సులు కలవర పెట్టాను. ఆ కలవరంలో నేను కూడా ప్రమాదంలో పడ్డాను. చారిత్రిక పౌరాణిక నాటకాలవల్ల నటకుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ కొంత జాతీయతా, స్వాతంత్ర్యభావమూ హెచ్చినా నైతికంగా కొన్ని ప్రమా