పుట:Naajeevitayatrat021599mbp.pdf/534

ఈ పుట ఆమోదించబడ్డది

తమ స్వంత అభిప్రాయాలను బహిరంగ పరచడం ఎప్పుడూ న్యాయం కాదు. దేశం తరపున తాము తమ నిశ్చితాభిప్రాయాలు తెలియ చెయ్యవలసి ఉన్నందున తమకు మున్ముందుగా స్వాతంత్ర్యం లభింప జేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదన్న విషయం మన నాయకులు స్పష్టంచేసి ఉండవలసింది.

కాని ఆచార విరుద్దంగా, 1930 ఆగస్టు 15 వ తేదీని మహాత్మాగాంధీ జెయిలునుంచే ఒక స్టేట్‌మెంట్ చేశారు. తానున్నూ, తన మిత్రులున్నూ, సప్రూ - జయకర్లు నడపిన రాజీ ప్రయత్నాలకు కృతజ్ఞులమనీ, ప్రభుత్వంవారు శాంతి నెలకొల్పే సదుద్దేశంతో కాంగ్రెసు వారితో సంప్రతించ తలచి ఉంటే. జెయిళ్ళలో ఉన్న ఆ నాయకులతో నిరాక్షేపణీయంగా సంప్రతింపులు జరపవచ్చుననీ ఆ స్టేట్‌మెంట్‌లో ఉంది. రాజీ ప్రతిపాదనల విషయంలో వైస్రాయ్‌గారి అనుమతికూడా ఉండి ఉంటే, గాంధీగారు అటువంటి స్టేట్ మెంట్ ఇవ్వవలసిన అవసరం ఉండేదికాదు.

రాయబారాల వైఫల్యం

మధ్యవర్తులు రెండు నెలలపాటు పడిన తంటాలుకు ప్రతిఫలంగా జెయిళ్ళలో ఉన్న నాయకుల వద్దనుంచి ఇటువంటి స్టేట్ మెంట్ తీసుకు రాగలగడం వారి ప్రతిభే యేమో! గాంధీగా రిచ్చిన ఈ స్టేట్ మెంట్‌తో వైస్రాయ్‌గారి బుర్ర తిరిగిపోయిందనీ, తాను ఏవిధమయిన రాజీ ప్రతిపాదనలూ చెయ్యకుండా నిమ్మకు నీరెత్తినట్లు చల్లగా ఊరుకుంటానేమో అనుకునే గాంధీగారు ఈ స్టేట్ మెంట్ ఇచ్చి ఉంటాడని వైస్రాయ్ తలచి ఉండాలనీ, ఈ పరిస్థితికి గాంధీగారి స్టేట్ మెంట్ కారణ భూతమయిందనీ, నైనిటాల్ జెయిలునుంచి ఆ నెహ్రూగారు ఎరవాడ జెయిల్లో ఉన్న గాంధీగారికి తెలియజేశారు.

ఆగస్టు 31 వ తేదీని మధ్యవర్తిత్వ ప్రయత్నమనే ఆ తతంగమంతా నిష్పలం అయినట్లు తేలిపోయింది. స్వరాజ్య సాధనకై చరిత్రాత్మకంగా సాగించిన బ్రహ్మాండమయిన అహింసాత్మక సమరంతో ప్రపంచ దృష్టినే ఆకట్టుకోగలిగిన కాంగ్రెసువారు, అనుకోని విధంగా