పుట:Naajeevitayatrat021599mbp.pdf/533

ఈ పుట ఆమోదించబడ్డది

నమ్మి తన హృదయంలో ఉన్న ఏ భావాలనయితే ఆయన ఎదుట పెట్టాడో, అవన్నీ అప్పుడే స్లోకోంబ్ వైస్రాయ్‌గారికి అందజేయడమే.

ఎప్పుడయితే మోతీలాల్‌నెహ్రూ సంపూర్ణ బాధ్యతాయుత ప్రభుత్వం ఇచ్చే విషయమై రహస్యపుటొప్పందానికి దిగజారిపోయాడో, పైగా రౌండ్‌టేబిల్ కాన్ఫరెన్స్‌వారి ప్రత్యామ్నాయ సూచనలకు ఆ ఒప్పందం లోబడవచ్చునని అంగీకరించాడో, ఆ తక్షణం వైస్రాయ్‌ గారు తాను ఏ విధమయిన రహస్యపు టొప్పందాలకూ అంగీకరించ కూడదనే నిశ్చయానికి వచ్చేశాడు.

న్యాయంగా, స్లోకోంబ్ ద్వారా నెహ్రూగారి సూచనలను గ్రహించిన తక్షణం, సప్రూ - జయకర్ గార్లకు గాంధీగారిని కలుసుకోవడానికి అనుమతి నిరాకరించి ఉండవలసింది. దానికి బదులుగా, దెబ్బతో బాధపడేవాడి నెత్తిన మొట్టికాయ కూడా మొట్టినట్లుగా, తాను కాంగ్రెసువారి కోరిక ప్రకారం, ఏవో కొన్ని సంస్కరణలను మాత్రమే సూచించ గలననీ, వాటిని పట్టుకునే ప్రజలు వారి వ్యవహారాలను వారు చక్కదిద్దు కోవాలని చెప్పేశాడు. మధ్యవర్తులుగా వ్యవహరిస్తామని బయల్దేరిన పెద్దలు తప్పుటడుగు వేస్తే ఇంతకంటె అధికంగా ఏం జరుగుతుంది?

జెయిలునుంచి గాంధీగారి స్టేట్‌మెంటు

గాంధీగారు, తాను ఖైదీగా ఉంటూ తన తరపునా, దేశం తరపునా ఏ విధమయిన సూచనలనూ చెయ్యజాలనని అనడం న్యాయంగానూ, ధర్మంగానూ ఉంది. ఈ రూలు ఎల్లప్పుడూ, అందరికీ, అన్ని దేశాలవారికీ వర్తిస్తుంది. అంత తీవ్రంగా జవాబు ఇస్తూ గాంధీగారు, మళ్ళీ ఇవి నా స్వంత అభిప్రాయాలంటూ కొన్ని సూచనలు చెయ్యకుండా ఉండి ఉంటే బాగుండేది. స్వంత అభిప్రాయాలంటూ గాంధిగారు కొన్ని సూచనలు చేసిన కారణంగానే, నెహ్రూద్వయం వారితో ఏకీభవించ జాలమని అనడంలో దోషం ఏమీ లేదు.

ఎంతో ఘనంగా అహింసాత్మకంగా పోరాటాన్ని సాగించిన అనంతరం, ఒక దేశ స్వాతంత్ర్య విషయమైన ప్రస్తావనలో, తమ