పుట:Naajeevitayatrat021599mbp.pdf/530

ఈ పుట ఆమోదించబడ్డది

ముందుగా మన నాయకులు ప్రభుత్వంవారితో సంప్రతించడానికి వీలుగా వారిని మున్ముందుగా విడుదల చేయమని కోరడానికి బదులుగా, మాకు వారిని కలవడానికి అవకాశం ఇవ్వండి అని సప్రూ - జయకర్లు అడగడం ఒక అసాధారణ విధానం.

పైగా, ఈ మధ్యవర్తిత్వం వహించిన పెద్దలకు కాంగ్రెసన్నా, కాంగ్రెసు వారి విధానాలన్నా మొదటినుంచీ వ్యతిరేక భావమే. కాగా, వారు బహిరంగంగా ఈ శాసన ధిక్కారాన్ని ఈసడించిన పెద్ద మనుషులు. అటువంటి పరిస్థితులలో ఈ పెద్దలు కాంగ్రెసు వారికీ, ప్రభుత్వం వారికీ మధ్య సంప్రతింపులు సాగిస్తాం అంటే, వారియందు విశ్వాసం ఉంచడం ఎల్లా సాధ్యం అవుతుంది? వారు కాంగ్రెసువారి మనోభావాలను గ్రహించి, ఆ నాయకులను విడుదల చెయ్యకుండా, సంప్రతింపులు జరపడం న్యాయం కాదుగనుక, వారిని ముందుగా విడుదల చెయ్యవలసిందని ప్రభుత్వానికి సలహా ఇచ్చి ఉండవలసింది. అదే న్యాయ మయిన పద్ధతి గదా! లేదా, వారు ప్రభుత్వంవారి మనోభావాలను గ్రహించి, వారు ఇవ్వ దలచిన దేమిటో తెలుసుకుని, ఆ వివరాలు కాంగ్రెసు వారికి తెలియజేసి ఉండవలసినది. ఈ రెండు పద్ధతులలో యేదీ వారు అనుసరించలేదు.

వారు మున్ముందుగా పండిత మోతీలాల్‌నెహ్రూగారితో సంప్రతించి, వారి మనోభావాలను గ్రహించి, వారిని పిడికిల్లో ఇముడ్చుకున్నారు. ఎప్పుడూ ఏదో ఒకరకంగా రాజీపడితేనే మంచిదని వాంఛించే ఆ మోతీలాల్‌గారు, అడిగినదే తడవుగా తమ మనోభావాలన్నీ వారితో విప్పి చెప్పేశారు. అల్లా చెప్పేముందర, ఆయన మంచి చెడ్డలు యోచించలేదు. ఆయనకు తాను పలుకుతూన్న పలుకులు కాంగ్రెసుకూ, తనకూ కూడా చిక్కులు కలుగజేస్తాయేమోనన్న ఆలోచన లేకుండా పోయింది. మోతీలాల్‌గారిని 1930 జూన్ వరకూ అరెస్టు చేయలేదు.

లండన్‌లో ప్రచురించబడే డెయిలీ హెరాల్డ్ స్లోకోంబ్ సూచనలు విలేఖరులలో స్లోకోంబ్ (Slocombe) ఒక ప్రముఖ విలేఖరి. ఆయన ఆంగ్లేయుడు. ఆయన తన పత్రికలో 1930 నవంబరులో కలువ