పుట:Naajeevitayatrat021599mbp.pdf/523

ఈ పుట ఆమోదించబడ్డది

పాతకాలపు స్వరాజ్య పార్టీవారు కాళ్ళ బేరానికి దిగి, స్వాతంత్ర్యాది వాంఛలను దిగ మింగడమే. కలకత్తా కాంగ్రెస్‌లో మన ఆశయం స్వాతంత్ర్యమేనని నిరూపించడం జరిగిన మాట వాస్తవమే. ఒక ప్రక్క తీవ్ర నిరసనతో కూడిన బహిష్కరణ, ఇంకోపక్క ఏదో ఒకటి ఇప్పించండి బాబూ అంటూ కాళ్ళ బేరమూ, ఇవే ఆంగ్లో - ఇండియనులు బిర్రబిగిసి పోవడానికి కారణ భూతాలయ్యాయి.

పాతపాటే

స్వరాజ్య పార్టీవారికి ఈ పద్ధతి నూతనం కాదు. వారి తత్వం మొదటినుంచీ ఒక్కలాగే ఉంది. 1917 - 18 మాటే యేమిటి, అంతకు ముందునుంచీకూడా వారి పద్ధతులు అల్లాగే ఉన్నాయి. మాంటెగ్, ఛెల్మ్స్‌ఫర్డ్ గారల పరిశోధనలు ఎల్లా నడిచాయి? డా॥ అనిబిసెంట్ మొదలైన నాయకులందరూ 1917 కు పూర్వం ఏ దారి తొక్కారో ఆ బాటలోనే 1928 - 29లో కూడా మన స్వరాజ్యపార్టీ నాయకులు నడిచారు. ఆ 1917 - 18 సంవత్సరాల లోనూ, 1928 - 29 లలోనూ జరుపబడిన అలజడులతో నాకు సంబంధం ఉన్న కారణంగా, ఆ రెండు సందర్భాలలో నడచిన చరిత్ర ఇక్కడ టూకీగా తెలియజేయడం నా కర్తవ్యంగా భావిస్తాను. 1917లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అనిబిసెంటమ్మ 1918 లో భారత దేశానికి డొమినియన్ స్టేటస్ ఇవ్వక తప్పదనీ, ఆలా ఇవ్వబడిన అధినివేశ ప్రతిపత్తి పద్ధతులనూ, విధానాలనూ భారతదేశం బాగా ఆకళించుకున్న తరవాత, అనగా సుమారు ఐదు మొదలు పది సంవత్సరాల లోపల ఆ డొమినియన్‌ను స్టేటస్‌ను పూర్తిగా భారతదేశంలో అమలు పరచాలనీ ఆమె కోరారు.

1918 లో నడచిన చరిత్ర

అదే సంవత్సరంలో జరుపబడిన రెండవ కాంగ్రెస్‌లో, బ్రిటిష్ ప్రభుత్వంవారు భారతదేశానికి స్వయంపరిపాలనావకాశం తప్పక కలుగజేస్తామనీ, ఎప్పటినుంచి ఆలాంటి అవకాశాన్ని భారతదేశానికి ఇవ్వవచ్చునన్నది నిర్ధారణ చేస్తూ, రాజ్యతంత్ర పద్ధతిని, కట్టుబాట్లను