పుట:Naajeevitayatrat021599mbp.pdf/522

ఈ పుట ఆమోదించబడ్డది

నమ్మించాలని చూశారు. వారు నిజంగా స్వాతంత్ర్య ప్రతిపాదనే గనుక పట్టుకు కూర్చుంటే వారి కోర్కెలు చాలా అతిగా ఉన్నట్లు భావింపబడతాయని తలచారు.

అంతేకాదు, తమ స్వాతంత్ర్యవాంఛను విస్మరించి, అఖిల పక్ష సమావేశం వా రంగీకరించిన విధంగానే నడవాలని, అఖిల భారత కాంగ్రెసు కమిటీవారూ, పండిత మోతీలాల్ నెహ్రూగారూ కూడా, బాగా ఆలోచించి, అన్ని పార్టీలవారిని 1928 నాటి కలకత్తా కాంగ్రెస్‌కు ఆహ్వానించారు. సెక్రటరీ ఆఫ్ స్టేటూ, బ్రిటిష్ కాబినెట్టూ కూడా తాము ఎంతో వినయంగా కోరిన అ తగు మాత్రపు కోరికలను చాలా నిదానంగా పరిశీలించి అంగీకరిస్తారనే ఆశతోనే అఖిల పక్ష నాయకులూ ఆ కాంగ్రెస్‌కు హాజరయ్యారు.

గత సంవత్సరం మదరాసు కాంగ్రెస్‌లో ఆమోదించిన స్వాతంత్ర్య తీర్మానానికి భంగంరాని రీతిగా, అఖిల పక్ష సమావేశం వారు అంగీకరించిన ఆ పథకాన్నే మోతీలాల్ నెహ్రూ కమిటీవారు తమ రిపోర్టులో మూర్తీభవింపజేశారు. కాంగ్రెసు నాయకుల ఆలోచనా, వారి విధానమూ బ్రిటిష్‌వారి హృదయంలో పూర్తిగా వ్యతిరేక భావాన్నే కలిగించాయి. సైమన్ కమిషన్ బహిష్కారం వైస్రాయి హృదయంలోనూ, బ్రిటిష్ కాబినెట్‌లోనూ ఆగ్రహావేశాలు కలిగించింది. బాధ్యతా యుత ప్రభుత్వం, స్వాతంత్ర్యం అన్న కోరికలు వారిని ఇంకా కలవరపెట్టాయి. సైమన్ కమిషన్ బహిష్కరణ విజయమూ, అఖిల పక్ష సమావేశంవారి రాజ్యాంగ పథకమూ, వైస్రాయ్ ఇర్విన్‌ని కోపోద్రిక్తుణ్ణి చేశాయి. అటువంటి ఆవేశాలనూ, వాంఛలనూ అణగ ద్రొక్కి రూపుమాపడం తమ అందరి విధియని ఆయన తలచాడు.

ఆంగ్లో - ఇండియన్ పత్రికాధిపతులు ఉచితానుచితాలను మరచారు. భారత దేశాన్ని తుపాకి చేతబట్టి నడిపించవలసి ఉంటుందనీ, దానికి సంస్కరణలు ప్రసాదించడం కొన్ని సంవత్సరాల పాటు వాయిదా వేయవచ్చుననీ వారి పత్రికలు వ్రాశాయి. దీని కంతటికి కారణం ఆ