పుట:Naajeevitayatrat021599mbp.pdf/517

ఈ పుట ఆమోదించబడ్డది

కాంగ్రెసులో ఉన్న ఇతర సభ్యులకు వలెనే, నాకూ ఆ కాంగ్రెసు కాబినెట్ వారి లోట్లన్నీ తెలియరాలేదు. ఆచార ప్రకారం కార్యనిర్వాహక వర్గంలో ఒక ఆంధ్రు డుండడం మామూలు. ఆలాంటి సభ్యులలో మొట్టమొదటివాడు దేశభక్త కొండ వెంకటప్పయ్య పంతులుగారు. దర్మిలా నేనూ, నా తరవాత బులుసు సాంబమూర్తిగారూ ఆంధ్ర సభ్యులంగా ఉండేవారము. సాంబమూర్తిగారి తరవాత డా॥ భోగరాజు పట్టాభి సీతారామయ్యగారు ఆ స్థానాన్ని ఆక్రమించారు. అంతేగాని, మాలో ఎవ్వరికి స్థిరమయిన శాశ్వత సభ్యత్వం లేదు. ఈ సభ్యులు, అధ్యక్షునితోపాటు సాధారణంగా ఏటేటా మారేవారు.

రాజీ వదంతులు

కన్ననూరు జెయిలులో ఉన్న మేమంతా కాంగ్రెస్సుకూ, ప్రభుత్వానికీ మధ్య కుదరబోయే రాజీని గురించి కలలుగంటూ, ఆ రాజీ ఎప్పుడు, ఎంత త్వరగా కుదురుతుందా అని ఆశగా ఎదురు చూసే వారం. మాలో కార్యనిర్వాహక సభ్యు లెవ్వరూ లేని కారణాన్ని, మాలో ఎవరూ ముందుగా విడుదల కావడానికిగాని, అట్టివారి ద్వారా వారికొచ్చే ప్రత్యేక వార్తలద్వారా నిజా నిజాలు గ్రహించడానికిగాని అవకాశం ఎంతమాత్రమూ లేకుండా పోయింది.

రాజీ ప్రతిపాదనలు జరుగుతాయి, జరుగుతున్నాయి అన్న పుకార్లు 1930 ప్రారంభ దినాలలోనే ఆరంభమయ్యాయి. జయకర్ గారూ, సర్ తేజ్‌బహదూర్ సప్రూ ప్రభుత్వంవారి సూచనలు ఏమీ లేకుండా, తమంతట తాముగానే ఏదో రాజీ కుదిరితే బాగుండును అనుకుని ప్రయత్నించడానికి బయల్దేరితే, వారివలన ఏదో జరిగిపోతుందని తలచడం అవివేకమే గదా! కాని, పాపం, ఆశపడిన యువక బృందం నోరు తెరుచుకుని కూర్చుంది. పేపర్లలో మాత్రం ఈ మధ్యవర్తులు, ప్రభుత్వంవారి అనుమతితో గాంధీగారినీ, మోతీలాల్, జవహర్‌లాల్ నెహ్రూ లను జెయిళ్ళలో కలుసుకుంటారని వార్తలు పడ్డాయి. కాని వీరు అలా చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లుగాని, రాజీ ప్రతిపాదనలు చేసినట్లుగాని ఎక్కడా కనబడలేదు.