పుట:Naajeevitayatrat021599mbp.pdf/515

ఈ పుట ఆమోదించబడ్డది

చాలా దూరంగా ఉన్న వేరే జాగాలో ఉండేవారు. పరిస్థితి విషమించిన కారణంగా, సూపరింటెండెంట్ నన్ను కలుగజేసుకోమని కోరాడు. అతి కష్టంమీద పరిస్థితిని చక్కబరచగలిగాను. కాని, దానికి కొంత కాలం పట్టింది.

లాఠీఛార్జి

కొంతమంది ఖైదీల నడత జెయిలు అధికారులకు చికాకుగా ఉండేది. ఆ పరిస్థితి ఆరంభ దినాలలో మాకు తెలియదు. ఒక రోజు రాత్రి లాకప్పయ్యాక, సూపరింటెండెంట్ వెళ్ళిపోయాక, క్రింది తరగతి ఉద్యోగస్తులకు, తలుపులు తెరచి, అనుమానితులపై లాఠీఛార్జి చెయ్యాలని బుద్ధి పుట్టింది. మాకు ఏడ్పులూ, పెడబొబ్బలూ వినబడుతూన్నా, మమ్మల్ని లాకప్పులో ఉంచిన కారణంగా, తెల్లవారిందాకా అసలు ఏం జరిగిందో మాకు తెలియ రాలేదు. సూపరింటెండెంట్ తనకు ఏమీ తెలియదనీ, లాఠీఛార్జి విషయంలో తాను ఎట్టి ఉత్తరువూ ఇవ్వలేదనీ అన్నాడు. పరిస్థితి విషమించి ఉంటే, తన తరవాత ఒక్క జెయిలరుకు మాత్రమే లాఠీఛార్జీ జరిపించగల అధికారం ఉందన్నాడు.

ఉడ్స్ రాక

అప్పట్లో మలబారు జిల్లాకు ఇ. సి. ఉడ్స్ జిల్లా కలెక్టరు. ఆయన జెయిలును పరిశీలిస్తూ నా గదిలోకి వచ్చాడు. నా గదిలో ఒకదాని నిండా పుస్తకాలూ, తెల్ల కాగితాలూ, వ్రాత సామగ్రీ ఉన్నాయి. ఆ గదిలో నేను వ్రాసుకుంటూ కూర్చొని ఉన్నాను. నా గదిలోకి వచ్చి, ఆ పుస్తకా లన్నీ ఏమిటని అడిగాడు. వాటిని ఉపయోగించుకోడానికి ఎవరు అనుమతి ఇచ్చారని అడిగాడు. ఆయనకు ఒక ఖైదీ బండెడు పుస్తకాలు ముందువేసుకుని వ్రాసుకుంటూ కూర్చోవడ మన్నది కిట్టలేదు. "నీవు యే విషయంమీద వ్రాస్తున్నా"వని నన్ను అడిగాడు. నేను ప్రపంచ ఆర్థికవిధానాన్ని గురించి, బర్మా, సిలోన్‌లాంటి దేశాలలో నా పర్యటన అనుభవాలూ వ్రాస్తున్నా నన్నాను. ఆయన చికాకు చెందాడు కాని, ఎవరితో మాట్లాడుతున్నాడో గ్రహించుకొని తశ్శాంతి