పుట:Naajeevitayatrat021599mbp.pdf/513

ఈ పుట ఆమోదించబడ్డది

నాలో ఇంకా ఆ అహంభావం అల్లాగే ఉండిపోవడాన్ని, నాకు జెయిల కు రాకపూర్వం ఉండిన హోదా, గౌరవమూ, అంతస్తూ లాంటివి నేను మరవక పోవడాన్ని, సూపరింటెండెంటు నాకు ఆసనం చూపించక పోవడం అమర్యాదగా భావించాను. నేను చుట్టూ కలయజూచి, అ ఆఫీసులో ఒక మూలను ఒక కుర్చీ ఉండడం గమనించాను. ఆ కుర్చీ తెచ్చుకుని ఆయన బల్లకు సమీపంగా వేసుకుని కూర్చున్న తర్వాతనే ఆయనతో మాటలాడ నారంభించాను. ఆ చర్య ఆయన్నే అన్నమాటేమిటి, ఏ సూపరింటెండెంట్ నయినా చికాకుపెట్టి తీరుతుంది. ఇది జరిగిన కొద్ది రోజులలోనే నా బదిలీ సంగతి తెలుపబడింది. బహుశ: నా బదిలీకి పైని ఉదహరించిన రెండు ఉదంతాలూ కారణమయి ఉండవచ్చును.

ఏది ఏమయినా ఆ బదిలీవార్త నాకు విచార కారణం కాలేదు సరిగదా, ఒక్కయేడాదిలోనే నాల్గవ జెయిలుకూడా చూడబోతున్నాననే ఒక చిన్న ఆనందమే అంకురించింది. కన్ననూరు నాకు కొత్త జాగా కాదు. అప్పటికి 15 సంవత్సరాలుగా, మలయాళ దేశంతో నాకు పరిచయం ఉంది. జెయిలుకు రాకపూర్వమే నేను మలయాళ దేశమంతా పర్యటించాను. నేను అంత క్రితం కన్ననూరు జెయిలులో ఖైదీగా ఉండక పోయినా, అక్కడకు వెళ్ళి, ఆ జెయిలులో రెండు సంవత్సరాల శిక్ష ననుభవిస్తూన్న యాకుబ్ హుసేను గారిని ఆ జెయిలులో కలుసుకున్నాను. ఆ జెయిలు ఉన్న తావును బట్టీ, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితిని బట్టీ నాకా జెయిలు నచ్చింది. ఆ జెయిలు మంచి ఎత్తుమీద ఉంది. మలయాళ దేశపు శీతోష్ణస్థితిగతులు అంత యెక్కువ ఆరోగ్యకరమయినవి కాకపోయినా, అక్కడ ఉష్ణోగ్రత తక్కువ. రాష్ట్రంలోని ఏ ఇతర సెంట్రల్ జెయిలూ అటువంటి మంచి వాతావరణంలో లేదనే నా తలంపు. అన్నిటికంటె ముఖ్యం, ఉప్పు సత్యాగ్రహ విషయంలో ఆ జెయిలు ఎక్కువ ప్రసక్తిలోకి వచ్చింది. అందువల్ల ఆ జెయిలుకు ఆనందంగానే వెళ్ళాను. అక్కడ ఉన్న వేలాది తోటీ ఖైదీలు నన్ను