పుట:Naajeevitayatrat021599mbp.pdf/503

ఈ పుట ఆమోదించబడ్డది

బాదేవారు. తప్పిదమన్నది ఉన్నా లేకపోయినా ఖైదీలను బాదడం అన్నది అక్కడి వార్డర్లకు అలవాటయిపోయింది. ఒకనాడు ఆ ఇనుప పెన్సింగ్‌కు సమీపంగా ఉన్న ఒక ఖైదీని తన తోలు బెల్టుతో అదేపనిగా ఒక వార్డరు బాదడం నా కంట బడింది. నేను అప్పుడు ఇతరులతో కలసి ఒక వరుసలో నిల్చుని ఉన్నాను. పాపం, ఆఖైదీ నోరుమూసుకుని ఆ దెబ్బలను సహిస్తున్నాడు. బాధతో ఏడుస్తున్నాడు. ఆ వార్డరు మాత్రం బాదడం మానలేదు. అట్టి పరిస్థితిలో నా మిత్రు డొకాయన గబగబా నా గదిలోకివచ్చి నన్ను పిల్చాడు. నేను బయటికి వచ్చి 'ఆపు' అని కేక వేసేసరికి, ఆ వార్డరు ఆ బెల్టు అక్కడ పారేసి పారిపోయాడు. ఈ విషయం కార్‌నిష్‌కు తెలుపబడింది. ఆయన వచ్చి నన్నూ, ఇతరులనూ అడిగి, జరిగిన సంగతి తెలుసుకుని తానే స్వయంగా ఆకేసు ఫయిసలు చేశాడు.

ఆ తర్వాత మమ్మల్నందర్నీ 'క్వారెంటైన్‌' నుంచి లోపలికి, అసలు జెయిలులోకి మార్చారు. అంతకంతకు సత్యాగ్రహ ఖైదీలు ఎక్కువయిపోయారు. జెయిలు అదికారులకు వారిని అదుపులో పెట్టడం ఎల్లాగో అర్థంకాలేదు. అందులో 'సి' క్లాసు యువక ఖైదీలను అసలే హద్దులో పెట్టలేకపోయేవారు. వారికి స్నానానికి ఇతరత్రా ఏ ఏర్పాట్లు లేకపోవడాన్ని ఒక పెద్ద దిగుడు బావిలో స్నానం చెయ్యమని అనుమతి ఇచ్చారు. జెయిలు అధికారులకు వారిని సరిదిద్ది శాంతి నెలకొల్పడానికి సాధ్యంకాని పరిస్థితిలో మాలో ఎవరినయినా తీసుకుని వెళ్ళి, మా సహాయంతో, శాంతి, క్రమపద్ధతి నెలకొల్పుకునేవారు. పరిస్థితి వారి చెయ్యిదాటి నప్పుడల్లా వారు మా సహాయంతోనే ఆ యువక రాజకీయ ఖైదీలలో శాంతి నెలకొల్ప కలిగేవారు.

మా 'ఎ' క్లాసు ఖైదీలను ఉంచిన గదులకు సరిగా వెనుక వరుసలో ఖైదీలందరికోసం ఏర్పాటయిన మామూలు వంటశాల ఉండేది. దానిలో వంట తెలిసిన ఖైదీలే వంటపనులు నిర్వహిస్తూ ఉండేవారు. అక్కడ తెల్లవారగట్ల 3 గంటలనుంచీ ఏవేవో పనులుంటూనే ఉండేవి.