పుట:Naajeevitayatrat021599mbp.pdf/496

ఈ పుట ఆమోదించబడ్డది

కారులో కోడంబాకం స్టేషనుకు తీసుకువెళ్లి అక్కడ ఒక మొదటి తరగతి పెట్టెలో ఎక్కించారు. డిప్యూటీ కమిషనర్ స్వయంగా నాతో ఆ గుంపులనుంచీ, గలటానుంచీ తప్పించడానికిగాను కోడంబాకం తీసుకువెడుతున్నానని చెప్పాడు.

సత్యాగ్రహిగా మారిన భాష్యం

చెన్నపట్నపు వాతావరణం ఉప్పు సత్యాగ్రహానికి సరిపడదని వారూ వీరూ అన్న దానితో సరిపోలిస్తే, పట్నంలో ఉద్యమానికి లభించిన చేయూత, దాని సఫలతా నా కెంతో గర్వకారణ మయాయి. దేశంలో ఉన్న అనేక పట్నాలలో చెన్నపట్నం రాజకీయంగా సుస్థిరమయిన స్థానాన్ని సంపాదించుకుంది.

అన్నిటికంటె విచిత్రమేమిటంటే, ఆనాడు మొట్ట మొదటి సభలో చెన్నపట్నపు వాతావరణం ఉప్పు సత్యాగ్రహానికి పనికిరాదని బల్ల గుద్ది వాదించిన ఆ లాయరు మిత్రుడు కె. భాష్యంగారు స్వయంగా ఈ సత్యాగ్రహ సమరంలో పాల్గొని, దెబ్బలుకూడా తిని, అరెస్టయి శిక్ష అనుభవిస్తూ మా వెల్లూరు జైలుకే వచ్చారు. ఆయన్ని జైలులో ఆహ్వానించగలగడం నాకు గర్వకారణమే అయింది.

చెన్నపట్నపు లాయర్లలో ఆయన ఒక ప్రముఖుడు. అటువంటి వాడు ఉద్యమ ప్రారంభంలో చేసిన తన తప్పును తాను గ్రహించి,ఎంతో ఘనంగా ఆసేతుశీతాచలం సాగుతూన్న ఆ అహింసాత్మక సమరం సంగతి బాగా తెలుసుకుని, అందులో స్వయంగా పాల్గొని, తాను చేయగలిగిన దేశసేవ చేశాడు.

వివిధ జెయిళ్ళలో నాకు గలిగిన అనుభవాలను తెలిపే ముందు ఈ ఉప్పు సత్యాగ్రహ సమరంలో చెన్నరాష్ట్రంలో జరిగిన సంఘటనలను గురించి టూకీగా చెప్పాలని ఉంది.

గాంధీగారు ఉప్పు సత్యాగ్రహ సంరంభానికి ప్రాతిపదికగా సబర్మతీ ఆశ్రమంనుంచి దండీవరకూ కాలినడకని యాత్ర సాగించి, తన ఉద్యమానికి బలం చేకూర్చుకున్న పద్ధతిని ఈ రాష్ట్రంలో పలు