ఈ పుట ఆమోదించబడ్డది

5

ఆనాటి రాజమహేంద్రవరం

ఆకాలంలో రాజమహేంద్రవరంలో విద్యాసంస్థల్ని గురించీ, విద్యావిధానాన్ని గురించీ విపులంగా వ్రాస్తాను. ఉత్తరోత్తరా ఈ విద్యావిధానం మన జాతినెలా నిర్వీర్యం చేసిందో తెలుసుకోవాలంటే ఆనాటి మన జాతీయ విద్యావిధానమూ, దాన్ని ఇంగ్లీషు స్కూళ్ళువచ్చి ధ్వంసం చేసిన విధమూ, అందువల్ల మనజాతి అవిద్యలో ములిగి పోవడమూ కూడా బాగా అవగాహన చేసుకోవాలి. ఈ నూతన విద్యావిధానానికి దాసుడైన నాబోటివాడి వర్ణన ఆ విషయంలో మరీ సమంజసంగా ఉంటుందను కుంటాను.

నేను నాయుడు పేట చేరేటప్పటికి దేశంలో ఇంగ్లీషు చదువు ప్రారంభమై ఏ పది సంవత్సరాలో అయివుంటుంది. ఇంగ్లీషువాళ్ళు ఈ దేశం పూర్తిగా స్వాధీనం చేసుకున్న తరవాత, "ఈ దేశంలో ఏ విద్యాపద్ధతి అమలులో పెట్టాలా?" అని తర్కించారు. చివరకి మెకాలే సలహామీద ఈ దేశంలో ఇంగ్లీషు చదువు స్థాపించడానికి నిర్ణయించారు. ఆనాటి పాలకుల విద్యాదర్శనం - ఆనాడన్న మాటేమిటి! ఈనాటి వరకూ కూడా అదే ఆదర్శం! - తమ పరిపాలనకి కావలసిన గుమాస్తాలనీ, దుబాషీలనీ తయారు చెయ్యడమే! అందుకోసమనే వాళ్ళు ఆ పని పైనించి ప్రారంభించారు. ముందు కాలేజీలు స్థాపించారు. వాటికి శాఖలుగా హైస్కూళ్ళు నడిపించారు. వాటికి ఉపశాఖలుగా ఇంగ్లీషు ఆదర్శాలతో నిండిన గ్రాంటుస్కూళ్లు స్థాపించారు. అంతకి పూర్వం వాటి స్థానంలో వుండే వీథిబళ్ళు ఎత్తివేశారు.

మన జాతీయమైన వీథిపాఠశాలల్లో నాలుగేళ్ళపాటు చదువుకుంటే వ్రాతా, చదువూ రావడమే కాకుండా, భారత భాగవతాది గ్రంథ పఠనానికి పునాది పడడమూ, మంచి లౌకికజ్ఞానం కలగడమూ కూడా జరిగేవి. ఈ గ్రాంటుబళ్ళు వచ్చి ఆ విధానం మార్చివేశాయి. మాట