పుట:Naajeevitayatrat021599mbp.pdf/486

ఈ పుట ఆమోదించబడ్డది

రంగయ్య నాయుడూ, భాష్యం చెట్టి గార్లేగాక, శ్రీమతి దుర్గాబాయి కూడా ఆ సభలో ఉపన్యసించి ప్రజల సహకారాన్ని కోరారు.

ఈ ప్రథమ బహిరంగ సభలో చేసిన విన్నపాలే ప్రజల్ని ఊపివేసి, వారి హృదయాలలో సుస్థిరంగా నాటుకున్నాయి. ఉప్పుమీద పన్నువేసే ప్రభుత్వ విధానమూ, విరివిగా లభ్యమయ్యే సముద్రజలాల నుంచీ, దేశంలో పలుచోట్ల ఉన్న ఉప్పు గుంటలనుంచీ నిత్యావసర వస్తువయిన ఉప్పును సంపాదించాడానికి కూడా ఎటువంటి అభ్యంతరాలను ప్రభుత్వం కలుగజేస్తున్నదీ ప్రజలకి స్పష్టం చెయ్యడం జరిగింది. అందువల్లనే, ప్రజల హక్కుల రక్షణకే మహాత్మా గాంధీ ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని లేవదీశారనీ విశద పరుపబడింది.

మొదటి జట్టులో దేశోద్ధారకుడు

ప్రబోధ ఫలితాలు వెంటనే కనబడ్డాయి. కనబడ్డ ఫలితాలు పరిధులు దాటాయి. ఆ మరుసటి రోజునుంచీ భోజన పదార్థాలు విరివిగా ఉదయవనం క్యాంపుకి జేరనారంభించాయి. అలా వచ్చే సప్లయిలు రోజుల తోటీ, వారాలతోటీ ఆగలేదు; నెలల తరబడి అలా వస్తూనే ఉన్నాయి. మేమంతా జెయిళ్ళకు వెళ్ళినా ఆ సప్లయి వస్తూనే ఉన్నాయి! 1931 లో గాంధీ - ఇర్విన్ ఒడంబడికలు సంతకాలయిన దాకా ఆ సప్లయిలు ఆగలేదు. ఆ మీటింగు అయిన తరవాత, నా నాయకత్వం క్రింద సత్యాగ్రహంచేసే మొదటి జట్టులో ఎవరెవరు ఉంటారో వారిపేర్లు వివరంగా పత్రికల వారికి అందజేశాం. పట్నంలో ప్రబోధం , ప్రచారమే గాక, అప్పుడే సంరంభం కూడా ఆరంభం అవుతోందన్న సంగతి విన్న నాగేశ్వరరావు పంతులుగారు పట్నం జేరుకున్నారు. ఆయన తనపేరు కూడా మొదటి జట్టులో చేర్చవలసిందని కోరుతూ టెలిఫోన్ జేశారు. అ ప్రకారం వారిపేరు జేర్చాం. ఆయన వచ్చి మాతో కలిశారు.

సముద్రపు టొడ్డున ఉప్పు పంట

ప్రతి దినమూ అవలంభించ దలచిన కార్యక్రమం ముందుగానే పత్రికా ముఖానా, ఇతర విధాలా కూడా ప్రకటించే వారము. ఆనాటి