పుట:Naajeevitayatrat021599mbp.pdf/485

ఈ పుట ఆమోదించబడ్డది

వారి ఉపన్యాసం సాంతం అయ్యాక, ఉన్న పరిస్థితి యావత్తూ విశదపరస్తూ, కాంగ్రెసు పిలుపును ప్రజలు మన్నించి తీరాలని హెచ్చరించాను. ఆ యిరువురి మిత్రులతోనూ మద్రాసు నగరం సజీవంగానే ఉన్నదనీ, అచ్చటి ప్రజలు ఎటువంటి త్యాగానికయినా సరే సిద్ధపడి, భారతీయ స్వాతంత్ర్య సమరంలో వారి స్థానాన్ని చరిత్రాత్మకం చేసుకుంటారనీ మనవి చేశాను.

ఆ సభలో జనం కనబరచిన ఉత్సాహం అవధులు దాటింది. మదరాసు వాతావరణాన్ని గురించి మాటలాడిన ఆ ఇరువురి పెద్దలకూ కూడా 'మదరాసు' చాలా ఉత్సాహవంతంగానూ, సజీవంగానూ ఉన్నదనీ, పట్నం గనుక ఈ పోరాటంలో పాల్గొనక పోతే, భారతదేశ రాజకీయ చరిత్రాత్మక పటంనుంచి మదరాసువారే తమ గ్రామ నామాన్ని తుడిచి పారేసినవా రవుతారనీ తేలిపోయింది.

తరవాత నేను ఉదయవనం క్యాంపును గురించి వివరించి, మనం మన ఉద్యమాన్ని ప్రతిభావంతంగా నడపిస్తూ జయాన్ని సాధించే పర్యంతమూ ఆ క్యాంపును నడపవలసి ఉన్నదనీ, అది సవ్యంగా నడిచే భాధ్యత యావత్తూ ప్రజానీకంపైనే ఉన్నదనీ, దానికి కావలసింది కేవలం ధనం మాత్రమే కాదనీ, తినడానికి కావలసిన వస్తుసముదాయం కూడా ఎంతో అవసరమనీ చెప్పాను.

గురుకాబాగ్‌లో అకాలీ సత్యాగ్రహ సమరం నడచిన తీరూ దానికి కావలసిన వస్తుసముదాయం వాఠెల్లా సమకూర్చుకున్నదీ వారి వాలంటీరు దళాలలో పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన స్త్రీలూ, పురుషులూ, వైద్యులూ, నర్సులూ మున్నగు వారంతా చేరి ఎటువంటి సేవలు చేసినదీ విశదపరచాను. తుదకు ప్రభుత్వంవారే దారిలోకి వచ్చి, అకాలీల హక్కుగా వారి ఆలయ ప్రవేశానికి ఎల్లా తప్పని సరిగా ఒప్పుకోవలసి వచ్చిందీకూడా వివరించాను.

అటువంటి సహకారం మద్రాసు పౌరులనుంచి ఉదయవనం క్యాంపుకు ఆశిస్తున్నాననీ చెప్పాను. నేను మాటాడిన తరవాత గద్దె