పుట:Naajeevitayatrat021599mbp.pdf/474

ఈ పుట ఆమోదించబడ్డది

వీలునుబట్టి ఎవరికి వారే నీటిని మరగబెట్టి ఉప్పును తయారు చేయాలనీ నిశ్చయించాం.

అలాయిదాగా ఈ కార్యక్రమాన్ని నిశ్చయించుకున్నాక నేను చెన్నపట్నం వెళ్ళాను. ఈ ఉప్పుసత్యాగ్రహాన్ని గురించి కలాన్నింకా సాగించేలోపల, 1928 - 29 లలో జరిగిన ఇతర సంఘటనలను గురించి కూడా కాస్త చర్చిద్దాం.

ఆంధ్రుల కాంగ్రెసు ఆశయ సాధన

కలకత్తా కాంగ్రెసులో కల్లు, సారా అమ్మకాలను నిషేదించాలనీ; విదేశ వస్తు బహిష్కరణ చెయ్యాలనీ; కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ ఉన్న శాసన సభ్యు లందరూ నిర్మాణాత్మక కార్యక్రమ విధానాల పట్ల ఆసక్తి చూపాలనీ; కాంగ్రెసు మెంబర్లను విరివిగా జేర్చుకోవాలనీ; అంటరానితనం మంట గలపాలనీ; స్వచ్ఛంద సేవకులకు 'పిలుపు' పంపి, వారిని సరి అయిన పద్ధతులమీదు తయ్యారు చెయ్యాలనీ; గ్రామ పునర్నిర్మాణానికి, కష్టజీవుల సంఘాల స్థాపనకీ గట్టిగా కృషి చెయ్యాలనీ - తీర్మానించాము.

ఈ ఆశయాలను అమల్లో పెట్టడం విషయంలో ఎంతో ఉత్సాహం చూపబడింది. ఆంధ్ర దేశంలో ఒక్కొక్క ఆశయ సాధనకీ ఒక్కొక్క సంఘం ఏర్పరచబడింది. ప్రజలు కాంగ్రెసులో చేరినా చేరకపోయినా, నిర్మాణాత్మక కృషిలో వారు ఎప్పుడూ కాంగ్రెసుకు దన్నుగానే ఉండేవారు. మత సామరస్యం సాధించడానికి కొందరు వ్యక్తులు తంటాలు పడ్డా, వారి ప్రయత్నాలు అట్టే ఫలవంతం కాలేదు. ప్రజలలో చాలామంది స్వాతంత్ర్య ఫలసిద్దికోసం కాంగ్రెసుకు ఎప్పుడూ అండగా నిలుస్తూ, పిలుపు వచ్చిన వెంటనే రంగంలో ఉరకడానికి సిద్ధంగా ఉంటూండేవారు.

ఆంధ్ర దేశంలోని అన్ని జిల్లాలూ, తాలూకాలూ పదేపదే తిరగడంలో, నేను ఒకే ఒక సంగతి గ్రహించాను. ఈ రాష్ట్రంలోని ప్రతి మండలం, ప్రతి గ్రామం నాదేననీ, ప్రతి వ్యక్తీ నా వాడేననీ, నేను ఎప్పుడూ వాళ్ళవాడనే ననే భావం నాకు కలిగింది. ఆంధ్ర అంటే ప్రకాశం,