పుట:Naajeevitayatrat021599mbp.pdf/472

ఈ పుట ఆమోదించబడ్డది

యుద్ధకౌశలంతో జరిగే హింసాకాండకీ మధ్యగల తేడా పాడా లన్నీ వివరించాను. అంతేకాదు, కాంగ్రెసు విధానాలు ప్రయోగాత్మకంగా రుజువు పరచడానికి వీలులే నటువంటివే అయినా, విమర్శకులకు ఆ విధానాలలో జీవం కనబడకపోయినా, దేశం ఉత్తేజపూరితమై, సజీవంగానే ఉన్నదనీ, దేశీయులలో 'స్వాతంత్ర్య' వాంఛ రోజురోజుకూ అధికమై, ప్రజలు ఎటువంటి త్యాగానికయినా సంసిద్ధులై ఉన్నారనీ అన్నాను. ఇంతవరకూ వారి మనోభావాలన్నీ భయోత్పాతం కలిగించే ప్రస్తుత రాజ్యవిధానంలో అణగద్రొక్కబడి ఉన్నాయనీ, స్వాతంత్ర్యం కోసం సాగనున్న అహింసాత్మక శాంతి సమరంలో కూడా హింసాకాండ ప్రయోగించడానికి వెనుదీయని మనస్తత్వంతో పాలకులున్నారనీ గుర్తు చేశాను. నా దేశీయుల పరిస్థితి నాకు అమూలాగ్రం తెలుసుననీ, వారు ఆత్మసాక్షిగా ఒక నిశ్చయానికి వచ్చినప్పుడు పర్యవసానాలను లెక్కచెయ్యకుండా ఎటువంటి త్యాగాలకయినా సిద్ధపడగలరనీ విశదం చేశాను. దేశీయులందరూ ఈ సమరంలో దుర్మరణాల పాలయినా కోట్లాదిగా ఉన్నవారి ఆత్మలు ఆ 'బక్కవాని' పక్కనే ఉండి ఆయన ఆజ్ఞల ప్రకారం వర్తిస్తాయని స్పష్టం చేశాను. ఇదే ధోరణిలో ఆనాటి నా ఉపన్యాసం ముగించాను.

ఆ అసెంబ్లీ ప్రాంగణం, నిజంగా, స్త్రీ పురుషులకూ, చిన్నలకూ, పెద్దలకూ, యావన్మందికి ప్రబోధం కలుగజేయడానికి నాకెంతో ఉపకరించింది. దేశీయులంతా ఒక్కుమ్మడిని క్రమశిక్షణతో ఒక్క త్రాటిమీద నడుస్తూ, దేశంలో ఆంగ్లేయ ప్రభుత్వాన్ని సాగనియ్యకుండా ముందడుగు వేయవలసి ఉన్నదని ప్రబోధం చేశాను. ఈ అసెంబ్లీ హాలునుంచి నేను నేరుగా ఉప్పు సత్యాగ్రహ సమరంలో పాల్గొనడానికి ఇల్లాగే వెళ్ళిపోయినా ఆశ్చర్యపడవలసింది ఏమీ ఉండదని నొక్కివక్కాణిస్తూ ఆనాటి నా ఉపన్యాసాన్ని సాంతం చేశాను.

రాష్ట్రీయ కాంగ్రెసు ఆహ్వానం

నేను ఈ ఉపన్యాసం ఇచ్చిన తర్వాతనే మాలవ్యా పండితుడూ ఇతర మెంబర్లమూ రాజీనామాలిచ్చి, సత్యాగ్రహ సమర రంగంలో