పుట:Naajeevitayatrat021599mbp.pdf/467

ఈ పుట ఆమోదించబడ్డది

ఉన్నా, ఈ విషయం ఆయన ఎప్పుడూ నాతో చెప్పలేదు. ఆయన చాలా మితభాషి. తన గొడవలతో ఇంకొకరు బాధపడకుండా దాచి పెట్టుకునే రకం. ఆయన సన్నిహిత మిత్రులతో, సహచరులతో, ఆఖరికి ఆయనకు బాగా సన్నిహితుడయిన లాట్‌వాలాగారితోకూడా అదే పద్దతిగా వ్యవహరించే బాపతు వ్యక్తి ఆయన. నిజానికి చాలా గొప్ప వ్యక్తి. ఉత్తమ దేశభక్తుడు. ఆయన అధ్యక్ష స్థానాన్ని, నిమిషాలమీద విడిచి, తన శారీరక పరిస్థితిని గూడా విస్మరించి అరెస్టవడానికి కూడా సిద్ధమయిన మహాపురుషుడు.

విషాద మరణం

ఆ రోజులలో రాజకీయ ఖైదీల అంతస్తులు కూడా గమనించకుండా, విఠల్‌భాయ్‌లాంటి ఉత్తమ దేశభక్తుల శారీరక స్థితిని కూడా గమనించకుండా, అందరినీ ఒకే తీరున చూచేవారు. ఆయన్ని ఖైదీగా చెన్నరాష్ట్రానికి బదిలీ చేయడం మా కందరికీ విస్మయం కలిగించింది. ఆయన శారీరక స్థితీ, జైయిలులో అమలు జరిపే శిక్షా విధానమూ ఆయనకు బాధా కారణాలయ్యాయి. ఆయన కోయంబత్తూరు జెయిల్లో ఉండే రోజులలో, నేను కన్ననూరు జెయిల్లో ఉండేవాడిని. కోయంబత్తూరుకూ, కన్ననూరుకూ అట్టే దూరం లేదుగా? అందువలన వార్తలందుతూ ఉండేవి.

జెయిలులో ఒక భాగంనుంచి ఇంకొక భాగానికి స్ట్రెచ్చరు మీద తీసుకువెళ్ళే సందర్భాలలో ఆయన్ని జారవిడిచేవారుట. ఈ సంగతివిని నేను చాలా బాధపడ్డాను. నేను నిజంగా చాలా తప్పుజేశానేమో! ఇప్పుడు ఎంత అనుకున్నా ఏం లాభం? నిజానికి ఆయన అరెస్టుకీ, ఈ జెయిలు పరిస్థితికీ, అన్నింటికీ మూలకారణం నేనే గదా! నేను అంతగా ఆయన్ని ప్రోద్బలంచేసి ఉండకపోతే, ఆయన అసెంబ్లీ అధ్యక్ష స్థానానికి రాజీనామా ఇవ్వకుండా, అలాగే సుఖంగా ఉండిపోయేవాడేమో! రాజీనామా ఇచ్చినా స్వాతంత్ర్య సమరంలో పాల్గొనకుండా నయినా ఉండేవాడు.