పుట:Naajeevitayatrat021599mbp.pdf/461

ఈ పుట ఆమోదించబడ్డది

పోటీగా అభ్యర్థులను నిలబెడతారనీ ఎన్నోరకాల పుకార్లుండేవి. నేను స్థిరమయిన కాంగ్రెసువాదిగా జస్టిస్ పార్టీవారినీ, లిబరల్ పార్టీవారినీ, తదితర పార్టీలవారినీ విమర్శిస్తూ, వారిని చులకన చేస్తూ శాసన సభలోకూడా మాటాడుతూన్నా, నిజంగా ఆ పార్టీలలో నాకు విరోధు లెవ్వరూ లేరు. ఏ పార్టీ వారు నాకు ప్రత్యర్థిగా ఏ వ్యక్తినీ నిలబెట్టలేదు. దాన్తో ఇంకో పుకారు లేవదీశారు. నా సన్నిహితులయిన కాంగ్రెసువారే, నా విధానంవల్ల వచ్చిన చికాకులవల్ల, నాకు ఇబ్బంది కలుగజేయడంకోసం ఎవరినైనా ప్రత్యర్థిగా నిలబెట్టి తీరతారనీ, వారూ వీరూ అనడం ఆరంభించారు. కాని కాంగ్రెసువారూ బాగా ఆలోచించుకుని నాకు ప్రత్యర్థిగా ఇంకొకరిని నిలబెట్టాలనే అభిప్రాయం విడిచిపెట్టారు. దాన్తో, నా సొంత టికెట్ మీదనే నేను ఏవిధమయిన పోటీ లేకుండా, ఏకగ్రీవంగా కేంద్ర శాసన సభకి ఎన్నికయినట్లు నిర్ధారణయిపోయింది.

సభాప్రవేశం పట్ల నిరుత్సాహం

కాంగ్రెసు నాయకత్వంతో నాకు వచ్చిన అభిప్రాయ భేదాలవల్ల రాజీనామా ఇచ్చి, నా సొంత టికెట్‌మీద ఎన్నికయ్యానేగాని నాకు నిజంగా శాసన సభాకార్యక్రమాలలో పాల్గొనాలనే అభిలాష లేకపోయింది. నా ఉత్సాహము నీళ్ళుగారిపోయిందా? ఏమోమరి. నేను 1930 ఆరంభంలో జరిగిన శాసన సభా సమావేశాలకు హాజరు కాలేదు.

కాంగ్రెసు వారందరూ శాసన సభనుంచి వై దొలగినా, సభాధ్యక్షుడుగా విఠల్‌భాయ్ పటేల్ మాత్రం శాసన సభని అంటి పెట్టుకుని వుండక తప్పలేదు. ఏ పరిస్థితి కయినా తట్టుకుని నిర్వహించుకు రాగల ప్రజ్ఞాశాలి ఆయన.

కాంగ్రెసు ఆదేశాన్ని వ్యతిరేకించి, కాంగ్రెసు సభ్యులతోపాటు రాజీనామా ఇవ్వకుండా, శాసన సభనే అంటిపెట్టుకుని ఉండి, కొందరు పెద్దలు శాసన సభలో ఇంకో కొత్త పార్టీని లేవదీసి, దానికి "కాంగ్రెసు నేషనలిస్ట్ పార్టీ" అని నామకరణం చేశారు.