పుట:Naajeevitayatrat021599mbp.pdf/457

ఈ పుట ఆమోదించబడ్డది

అంగీకరించబడలేదో, ఆ తక్షణం 'ఇండిపెండెంట్‌' పార్టీ అన్న పేరుతో ఒక పార్టీని స్థాపించారు. దేశంలో వున్న ఇతర పార్టీ లన్నింటితోనూ కలిసి, పరస్పర సహాయ సహకారాలతో ముందుకు నడవా లనుకున్నారు.

ప్రత్యక్ష చర్యకు విరుద్ధంగా ఏర్పడిన ఈ 'ఇండిపెండెంట్‌' పార్టీలో నేను చేరలేదు. కాంగ్రెసు తీర్మానంతో అసంతృప్తి కలిగిన నాకు, ప్రత్యక్ష చర్యలో పాల్గొని జైలు శిక్షను వాంఛించే ముందు, కేంద్ర శాసన సభనుంచి వైదొలగడం న్యాయమని తోచింది. వేరే సందర్భంలో, కాంగ్రెసుపార్టీ సభ్యునిగా విరమించుకుని, స్వంత శక్తిమీద ఆధారపడి, తిరిగి కేంద్ర శాసన సభలో ప్రవేశించి, వెంటనే ఎల్లా సమర రంగంలోకి దూకిందీ వివరించే ఉన్నాను.

శ్రీనివాసయ్యంగారి తత్వం

ప్రత్యక్ష చర్య, యుద్ధం, జెయిలు లాటి ప్రశ్నలు ఉత్పన్నమయినప్పు డెప్పుడూ కూడా శ్రీనివాసయ్యంగారి ప్రవృత్తిలో గమనించ తగ్గ మార్పులు కనబడుతూనే ఉన్నాయి. ఇదివరలో సైమన్ కమిషన్ రాక సందర్భంలో, ఆయన నన్ను ఒక ఇరకాటంలో పెట్టి, తాను మదరాసు ప్రయాణం విరమించుకుని, నన్ను చికాకులపాలు చేసిన ఉదంతం వివరించే ఉన్నాను.

ఇప్పుడు మళ్ళీ ఈ "ఉప్పు" గొడవ ఒకటి ఆయన పీకలమీదికి అనుకోని విధంగా వచ్చి పడింది. ఆయన సుభాస్‌చంద్రునితో కలిసి, సవాలు వాయిదా కాలం రెండు సంవత్సరాలంటే చాలా దీర్ఘం అవుతుంది, దానిని ఒక్క సంవత్సరానికి తగ్గించమని కోరిన సందర్భంలో, గాంధీగారు ఆ సవరణ నంగీకరిస్తూ, సంవత్సరం ఆఖరు నాటికి మీరు సిద్ధంగా ఉండాలి అని అన్నప్పుడు, పాపం, శ్రీనివాసయ్యంగారికి ఆ పలుకులలోని అంతరార్థం అర్థమయి ఉండదు.

ఏడాది గడువు కాలంలోనూ, దేశాన్ని ఏ విధంగానూ ప్రత్యక్ష చర్యకు సిద్ధపరచకుండా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుని, చివరికి ప్రత్యక్ష