పుట:Naajeevitayatrat021599mbp.pdf/450

ఈ పుట ఆమోదించబడ్డది

మన నాయకులు 1928 - 29 లో చేసిన పొరపాట్లకీ, 1917 - 18 లో మాంటేగ్ - ఛల్మ్‌స్పర్డు కమిషన్‌వారు వచ్చే ముందు చేసిన పొరపాట్లకీ తేడాలేదు. ఆనాటి పొరపాట్లే ఈనాడూ జరిగాయి. ఎటొచ్చీ ఒక్కటే తేడా - మాంటేగ్ కమిషన్ని ఆహ్వానించి వందనా లర్పించాం; సైమన్ కమిషన్ని బహిష్కరించి, గో బాక్, అన్నాం. ఆ మాంటేగ్ కూడా అంతే చేశా డనుకోండి. కాంగ్రెసు ఆశయాలకూ, కోర్కెలకూ భిన్నంగా ఏదో వాగి, ఏదో వ్రాసిపోయాడు. ఆ స్టేట్‌మెంట్లకు తన డయ్‌రీలో భాష్యాలు వ్రాసుకుని, తమ రిపోర్ట్‌లో అల్లా వ్రాయడానికి కారణాలుగా ఆ భాష్యాలను దర్మిలా ప్రకటించాడు.

శాసన ధిక్కారానికి ఉద్యుక్తత

1928 లో కాంగ్రెసువారి కోరిక బలీయంగా ఉన్నప్పుడు మోతీలాల్ నెహ్రూ తన అధ్యక్షోపన్యాసంలో ప్రభుత్వంవారు దయదలచి యేమిచ్చినా సరేనని; రౌండు టేబిల్ కాన్ఫరెన్స్‌కు పిలుపువచ్చే రోజులలో, ఆ సమావేశంలో ఏం జరిగినా, బ్రిటిషువారు తాము భారత దేశానికి ఇవ్వాలని అనుకుంటూన్న దేమిటో ఆ క్షణంలోనే విశదపరచ వలసిందనీ కోరారు. ఏదయితేనేం, కలకత్తా తీర్మానం కాంగ్రెసువారి ప్రతిభనూ, ప్రతిష్ఠనూ అధికం చెయ్యలేకపోయింది.

కాని కలకత్తా కాంగ్రెస్‌లో తేలినదల్లా ఒక్కటే: మోతీలాల్ నెహ్రూగారికి, తాము 1921 - 22 నుంచీ పి. ఆర్. దాస్‌గారితోపాటు ఎన్నో ఆశలు పెట్టుకున్న పార్లమెంటరీ విధానంపట్ల విముఖత కలిగిందన్నది.

కాంగ్రెసువారు, శాసన సభల నుంచి బయటికి వచ్చి శాసన ధిక్కారం ఆరంభించే ముందు బ్రిటన్‌కి ఒక్క యేడాది గడువివ్వాలనీ, అ గడువులోపల ఇండియకి స్వాతంత్ర్యం ఇవ్వడానికి ఆంగ్లేయుల కంగీకారం కాకపోతే, అ గడువు దాటగానే శాసన ధిక్కార కార్యక్రమం అమలు పరచాలనీ నిర్ణయించుకున్నారు.