పుట:Naajeevitayatrat021599mbp.pdf/449

ఈ పుట ఆమోదించబడ్డది

భారతదేశం నుంచి వైతొలగితేగాని భారత దేశానికి సిసలయిన స్వాతంత్ర్యం లభించదనీ; 2. (మోతీలాల్) నెహ్రూ కమిటీవారి ప్రతిపాదనలు ఆంగ్లేయ ప్రభుత్వం వారికి అంగీకార యోగ్యం అయ్యే ఎడల ఆ ప్రతిపాదనలను మా అవసరాలుగా భావించి అంగీకరించి తీరాలనీ; 3. నెహ్రూ కమిటీవారి సూచనలు కాంగ్రెసు వారికి మాత్రమే నచ్చినవిగా ఉండి, మదరాసు కాంగ్రెస్ అసలు కోరికకి విరుద్ధంగా ఉన్న కారణాన్ని, ఆ సూచనలు అంగీకరించడమన్నది ఆంగ్లేయుల హృదయ పరివర్తనకు మొట్టమొదటి మెట్టుగానే భావించబడుతుందనీ ఆ సవరణలో సూచించబడింది.

సరిగా యోచిస్తే ఈ సవరణ తీర్మానానికీ, 'స్వాతంత్ర్యమే మా ఆశయం' అంటూ విషయ నిర్ధారణ సంఘం ప్రతిపాదించిన రాజీ తీర్మానానికీ, మొదటి మెట్టుగా ప్రతిపాదించిన అఖిల పక్ష సమావేశం వారి యోచనకీ తేడా ఉన్నట్లు లేదు. కాని జవహర్‌లాలూ, సుభాస్‌బోసూ తమ సవరణ అసలు దానికి భిన్నమని నమ్మాడాన్ని ఆ తీర్మానం ప్రతిపాదించినట్లు కనబడుతుంది. అసలు ఆ రాజీ తీర్మానం వీరి జోక్యం లేకుండా ప్రతిపాదించడం జరిగింది. అందువల్ల వీరికి అనుమానం కలిగి, దానినే తమ భాషలో సవరణ తీర్మాన రూపేణా తిరిగి ప్రతిపాదించారనుకోవలసి ఉంటుంది.

ఏదయితేనేం, నేను లోగడ మనవి చేసినట్లు, ఆ 'స్వాతంత్ర్య' తీర్మానాన్నే కలకత్తాలో బలపరచి ఆంగ్లేయులకు అందజేసి ఉంటే, కాంగ్రెసుకున్న బలమూ, పట్టుదలా సైమన్ కమిషన్ వారికి పూర్తిగా గ్రాహ్యం అయి, వారి సలహా ఇతోధికంగా ఉపకారిగా ఉండేది. మన నాయకులలో ఉండే బలహీనత కారణంగానే, సైమన్ కమిషన్ వారు, ఏ విధమయిన పూచీగాని, బాధ్యతగాని లేని విధంగా, 'ప్రొవిన్షియల్ ఆటోనమీ' అనే దుష్టగ్రహ కూటంలోకి లాక్కు వెళ్ళగల విరుద్ధ భావాలతో కూడుకున్న ఒక పెడరేషన్ని (పరస్పర సహాయక రాజకీయ సంఘాన్ని) మన నెత్తిని రుద్దడానికి తయారయ్యేవారు.