పుట:Naajeevitayatrat021599mbp.pdf/448

ఈ పుట ఆమోదించబడ్డది

సంపాదించిన స్వానుభవంతో కేంద్ర శాసన సభలో కష్టజీవుల కుపయుక్తమైన నిబంధనావళిని ఏర్పరచాలన్నదే నా తహ తహ.

1929 లో మొదటి అర్ద సంవత్సరంలోనూ, కేంద్ర శాసన సభా కార్యక్రమం సాంతం కాగానే, మలయా రాష్ట్రాలు, సయాం, ఇండో చైనా పర్యటించాను. ఏడు మాసాలపాటు సమగ్రమయిన పర్యటన చేశాను. ఈ పర్యటనల అనుభవాలను గురించి ముందు ముందు సమగ్రంగా చెప్పుతాను. ఇప్పుడు 1928 - 29 సంవత్సరాలలో జరిగిన ఇతర ముఖ్య సంఘటనలను గురించి చెపుతాను.

6

బ్రిటిష్ వారికి పెట్టిన గడువు

మహాత్మా గాంధీగారి సహకారంతో మోతీలాల్ నెహ్రూగారు కలకత్తా కాంగ్రెస్ అధ్యక్షుడుగా మదరాసు కాంగ్రెస్‌లో ఆమోదించబడిన 'స్వాతంత్ర్య' తీర్మానాన్ని బుట్ట దాఖలు చేయడానికి చేసిన ప్రయత్నంపట్ల జవహర్‌లాల్ నెహ్రూ, సుభాస్‌చంద్రబోస్, శ్రీనివాసయ్యంగారు ప్రభృతులకు ప్రతికూల భావం ఉంది.

మదరాసు కాంగ్రెస్ ఆమోదించిన అ 'స్వాతంత్ర్య' తీర్మానాన్నే ఆశయంగా పెట్టుకుని, కలకత్తా కాంగ్రెస్ విషయ నిర్దారణ సంఘంలో, జవహర్‌లాల్ నెహ్రూ, సుభాస్‌చంద్రబోసూ కూడా, గాంధీగారి సహకారంతో పండిత మోతీలాల్‌నెహ్రూ ప్రతిపాదించిన 'తగు మాత్రపు' కోర్కెలకే తమ ఆమోదాన్ని వెలిబుచ్చారు. కాని బాగా ఆలోచించిన మీదట వారికి 'స్వాతంత్ర్య' తీర్మానం బలహీనమయి పోతోందేమోననే అనుమానం కలిగి, మోతీలాల్‌నెహ్రూగారి ప్రతిపాదనకు ఒక సవరణ సూచించారు.

సుభాస్ - జవహర్ల సవరణ

మున్ముందుగా కలకత్తా కాంగ్రెస్ మదరాసు కాంగ్రెస్ ఆమోదించిన 'స్వాతంత్ర్య' తీర్మానాన్ని బలపరుస్తూ, పూర్తిగా బ్రిటిషువారు