పుట:Naajeevitayatrat021599mbp.pdf/439

ఈ పుట ఆమోదించబడ్డది

పార్టీ, రాష్ట్ర శాసన సభలలోని కాంగ్రెసు పార్టీలూ సరిఅయిన క్రమ శిక్షణకు అలవాటు పడ్డవి. ఈ విషయాలన్నీ అసెంబ్లీలో ఉన్న కాంగ్రెసేతర పార్టీలన్నీ గుర్తించే ఉన్నవి. ఆంగ్లేయ రాజ్యతంత్రజ్ఞులూ, ప్రపంచ రాజకీయవేత్తలూ ఈ దేశంలో జరుగుతూన్న మార్పులూ, కాంగ్రెసు సాధిస్తూన్న ఘనవిజయాలు గమనిస్తూ ఉన్నారు.కాంగ్రెసువారినీ, వారి శక్రి సామర్థ్యాలనూ, భారతీయుల రాజకీయ చైతన్యాన్నీ యావత్తు ప్రపంచమూ గుర్తించి ఉంది. అయినప్పటికీ, కాంగ్రెసు నాయకులూ, తక్కిన పెద్దలూ కూడా - కాలాన్ని అనవసర తర్క వితర్కాలతో వృథా పుచ్చుతూ కార్యసాధనకు పూనుకోకుండా, దేశంలో ఏ పథకమూ ఆమోదింప జేయలేని స్థితిలో ఉన్నారు. నాయకులలో పరస్పర సహకారం లోపించే ఉంది. బ్రిటిషు పార్లమెంటరీ విధానమూ, వారిలో వారికి (పార్టీ విభేధా లుంటూ ఉన్నా) గల సహనభావమూ మనకింకా అవగాహన కాలేదు.

అఖిల పక్ష సమావేశాలు

కొన్ని కొన్ని అఖిల పక్ష సమావేశాలు ఆరంభమయిన వెంటనే అవతరించే హంసపాదులతోనే అంతమయ్యేవి. ఒకసారి ఆ సమావేశం అధ్యక్షుడుగా ఎవరు ఎన్నుకోబడాలి అన్న విషయం తేలక అది ఆగే పోయింది. ఏది ఎల్లా ఉన్నా, ఆ ఒక్క సంగతి మాత్రం ఒప్పుకుతీరాలి. కాంగ్రెసు నాయకులూ, కార్య నిర్వాహకులూ, ఎట్టి విభేదాలు వచ్చినా, చివరికి ఒక నిర్ణయానికి రావడమూ, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడమూ జరిగేది.

1928 ఫిబ్రవరి - మార్చి నెలలలో జరిగిన అఖిల పక్ష సమావేశాలన్నీ ముక్కాలు మువ్వీసం డిల్లీలోనే జరిగాయి. అప్పట్లో అసెంబ్లీ నడుస్తూన్న కారణంగా ఈ సమావేశాలు చులాగ్గా జరగడానికి డిల్లీలోనే అనుకూల వాతావరణం ఉండేది. అందువల్ల కౌన్సిల్ ఆఫ్ స్టేట్ వారికీ, కేంద్ర శాసన సభ్యులకూ ఏ విధమయిన చిక్కులూ, చికాకులూ ఉండేవికావు. దినాలకొద్దీ సమావేశాలూ సాగినా, అందరూ అక్కడే ఉంటూ ఉండడాన్ని ఆర్థికంగా కూడా అధిక వ్యయాలు అయ్యేవికాదు.