పుట:Naajeevitayatrat021599mbp.pdf/435

ఈ పుట ఆమోదించబడ్డది

ఆయన చాలా నేర్పరి. ఆంగ్లేయ భాషా పరిజ్ఞానం బాగా కలవాడు. మంచి మాటకారి. ఆయన ట్రెజరీ బెంచెప్‌వారికి సన్నిహితుడు కూడాను. ఆయన్ని గురించి చెడుగా అనడానికి మాకు గాని, ఇంకొకరికిగాని కారణం కనబడదు. ఆయన మా పార్టీ తరపునే మాటలాడుతూన్నా, ఆ మాటల తీరూ, అందలి విషయాలూ ఇటు మాకూ, అటు ప్రభుత్వ బెంచీలవారికీ కూడా ఉపయోగపడేలాగున గుంభనంగా ఉండేవి. ఆయన మా పక్కనుంచి మాటాడుతూన్నా, ఆ మాటాడే తీరు "అచ్చా, సెహబాస్! వినుడు వినుడు" లాంటి ఉత్సాహపూరిత వచనాలను, అందరిచేతా పలికించేదిగా ఉండేది. ఆయన తెలివితేటలు అటువంటివి. కాని అది అంతటితో ఆగుతుందా? దుష్ఫలితాలు రావూ?

తలవంపులైన సంఘటన

ఈ సందర్భంలో బొత్తిగా దిగజారిన పోయిన సందర్భం ఒకటి చెప్పడం న్యాయం. ఒకసారి, ఆర్థిక సంబంధమయిన ఒక బిల్లును గురించి వచ్చిన చర్చలో, ఒక అనుకోని సంఘటన జరిగిపోయింది. ఆ సంఘటన జరిగిన వెనువెంటనే నాకు తెలుపబడింది. వీలయితే, కాంగ్రెసుపార్టీవారి అభిమానాన్ని సంపాదించి, ఒక బిల్లు అంగీకరింప జేద్దామని ప్రభుత్వంవారు ఉవ్విళ్ళూరుతూన్న సందర్భం అది. మా పార్టీ మీటింగులో అ బిల్లును ప్రతిఘటిద్దామనే తీర్మానించుకున్నాము. అ బిల్లు మంచి చెడ్డలూ, దానివల్ల లాభనష్టాలూ బాగా తర్జన భర్జన చేశాకే ఆ నిర్ణయం తీసుకున్నాం. కొంత మందికి అ బిల్లును ప్రతిఘటించక పోయినా వచ్చే నష్టం ఏమీ లే దనే అభిప్రాయం బాగా ఉంది. అందువల్లనే బాగా తర్జన భర్జన చేశాకే దానిని ప్రతిఘటిద్దామనే నిశ్చయానికి వచ్చాం.

కాని ఆఖరు నిమిషంలో, ఓటింగు జరిగే ముందు, మేమంతా ఆ బిల్లుకు అనుకూలంగా ఓటు చేయాలనే ఆజ్ఞ చీఫ్ విహ్‌ప్పు దగ్గరనుంచి వచ్చింది. మాకు చాలా ఆశ్చర్యం అయింది. నేను కార్యదర్శిగారినీ, చీఫ్ విహ్‌ప్పునూ ప్రశ్నించాను. పార్టీ మీటింగ్ పెట్టి