పుట:Naajeevitayatrat021599mbp.pdf/430

ఈ పుట ఆమోదించబడ్డది

తర్వాతనే నేనూ, చిత్తరంజన్‌దాస్‌గారూ కార్యనిర్వాహక సభ్యులమయ్యాము. దాస్‌గారిలాగే లజపతిరాయ్ కూడ స్వాతంత్ర్య వాయువులను పీల్చి, స్వాతంత్ర్యాన్ని కాంక్షించి, తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించ కోరినవాడు. అ మొట్ట మొదటి కార్యనిర్వాహక వర్గంలోని సభ్యులందరూ మేధావులే. మేధావులే కాదు - ధీశాలురూ, విజ్ఞానవంతులూ కూడా.

దీర్ఘ దర్శిత్వం

లజపతిరాయ్ నాకు ముఖ్య స్నేహితుడు. మేము ఉభయులమూ లండను నగరంలో 1903 లోనే ఎల్లా సన్నిహితులమయ్యామో చెప్పి ఉన్నాను. అప్పటికి ఆయన దేశం నుంచి బహిష్కరించబడి ఇంగ్లాడులో ఉంటున్నాడన్నమాట! ఆయన మంచి తెగువ గలిగిన రాజకీయవేత్త. త్యాగానికి ఎప్పుడూ సిద్ధమే. సాంఘిక రాజకీయ పరిజ్ఞానం కలిగీ, ఎప్పుడూ లోకజ్ఞానాన్ని ఆధారం చేసుకునే ఏ ముఖ్య సమస్యనయినా పరిష్కరించేవాడు.

కేవలం ప్రజాదరణతోనే ప్రారంభించిన దేశీయ విద్యాలయాలూ, పారిశ్రామిక సంస్థలూ ప్రభుత్వ ఆదరణ లేకుండా నిలవ లేవని నాకూ, మా మిత్రులకూ విశద పరచిన దీర్ఘ దర్శి ఆయన. మేము అతి ఉత్సాహంతో, నిర్మాణ కార్యక్రమం పేరిట, 1921 లో శాసన ధిక్కా కారానికి ప్రాతిపదికగా ప్రారంభించిన దేశీయ విద్యాలయాలూ, పరిశ్రమలూ లాంటివన్నీ రెండేళ్ళు తిరక్కుండానే నాటి ప్రభుత్వంవారు అంత మొందించగలిగారు. ప్రభుత్వం వారికీ మాకూ చుక్కెదురు కూడాను. అటువంటప్పుడు ప్రభుత్వ చర్యలను ఎదుర్కొని విద్యాలయాలనూ, గ్రామీణ పరిశ్రమలనూ నడపడం దుస్సాధం కదా! ఆయన తన ఉపన్యాసాలలో ఎప్పుడూ నన్నూ, జవహర్‌లాల్‌నెహ్రూను కలిపే మాటాడుతూ, మా దేశసేవాకృషిని ఉదహరిస్తుండే వాడు. కేంద్ర శాసన సభా సభ్యులుగా మేము మరీ సన్నిహితుల మయ్యాము.