ఈ పుట ఆమోదించబడ్డది

అందు మూలంగా ఆయనతో నాకు కలిగిన సాహచర్యాన్ని గురించీ, ఇదివరకే వ్రాశాను. ఈనాటికీ ఆయనే నా జీవితానికి మార్గదర్శకుడు అనీ, నా అభివృద్ధికి మూలకారకుడు అనీ కృతజ్ఞతాపూర్వకంగా విశ్వసిస్తాను.

అందుచేత, ఆయన్ని గురించి కొంచెం వ్రాస్తాను. ఆయన తండ్రిగారు కొత్తపట్నంలో కరిణీకం చేస్తూ వుండేవారు. వారిది ఆది వెలమకులం. ఎప్పుడో వారి పూర్వులది బందరు కావచ్చును. కాని, హనుమంతరావునాయుడుగారి తండ్రిగారు కొత్తపట్టణంలో కరిణీకం సంపాదించారు. సామాన్యంగా గుంటూరుజిల్లాలో కరిణీకం బ్రాహ్మణుల కుటుంబాల్లోనే వుండేది. అయితే, ఆ ఊరికిమాత్రం ఇది ఈ ఆదివెలమ కుటుంబానికి ఎట్లా సంక్రమించిందో నేను చెప్పలేను. ఈ నాటికీ ఆ కరిణీకం ఇమ్మానేనివారి కుటుంబంలోనే వుంది. మెట్రిక్యులేషన్ అయి, మాష్టరీ ప్రారంభించేసరికి హనుమంతరావు నాయుడుగారికి సుమారు 25 సంవత్సరాల వయస్సుంటుంది. ఆయన లెక్కల్లో చాలా ప్రతిభావంతులని ప్రతీతి. ఆయన మెట్రిక్యులేషన్ పాసయి మెట్రిక్యులేషన్ క్లాసుకీ, దాని కింది క్లాసులకీ లెక్ఖలు చెప్పేవారు. అంతేకాకుండా యఫ్.ఏ., బి.ఏ. పరీక్షలకి చదివేవాళ్ళు కూడా ఆయన దగ్గిరికి వచ్చి లెఖ్ఖలు నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. ఇంగ్లీషు వ్యాకరణం మొదలయినవి చెప్పడంలో కూడా ఆయనకి మంచి పేరు వుండేది. అప్పటికే బి.ఏ. చదువుతూ ఉండిన కొండా వెంకటప్పయ్యగారిని ఆ రోజుల్లో లింగంగుంట వెంకటప్పయ్య అనేవారు. వారి ఊరు లింగంగుంట కావడమే దీనికి కారణము. కొంపల్లి కోటిలింగం, మన్నారు కృష్ణయ్య మొదలయినవారు మా నాయుడుగారి శిష్యులే. వారంతా అక్కడే మెట్రిక్యులేషన్ పాసయి లెఖ్ఖలు మొదలయిన విషయాల్లో ఆయనదగ్గిర సంశయనివారణం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆంధ్రదేశంలో అఖండ గణితశాస్త్రవేత్తగా ప్రఖ్యాతి పొందిన పాంచాలవరపు సుబ్బారావు కూడా ఆన శిష్యుడే. నాకు కేవలం అదృష్టం వల్ల ఆయన శిష్యరికం లభించింది.