పుట:Naajeevitayatrat021599mbp.pdf/401

ఈ పుట ఆమోదించబడ్డది

కమిషన్‌ని రాయల్ కమిషన్‌వారు ఏర్పాటు చేయలేదనీ, ఆలా భావించ బడుతున్న ఆ ఇండియన్ కమిటీని రాజుగారే ఏర్పాటు చేశారనీ, ఆ సవరణ తీర్మానంలో చెప్పబడింది.

రాయల్ కమిషన్ వారి ప్రకటన రాజుగారు చేసినట్లే నన్న భాష్యం నిజంగా ఏ యిరువురి వ్యక్తుల మధ్యనయినా వివాదం వచ్చిన సందర్భంలో బాగా వర్తిస్తుంది గాని, రాయల్ కమిషన్ వారి పదాలకు అటువంటి భాష్యం చెప్పడం అంటే, ఈపట్టున సెక్రటరీ ఆఫ్ స్టేట్ పలికిన పలుకులకు భాష్యం చెప్పినట్లే.

మోతీలాల్ నెహ్రూగారికి రాయల్ కమిషన్ అన్నది రాజుగారు స్వయంగా ఎన్నుకున్నది కాదనీ, రాజుగారి స్థానే మాట్లాడే సెక్రటరీ ఆఫ్ స్టేట్ దానిని రాజుగారి తరపున నియమించాడనీ, రాజుగారు ఇప్పట్టున రాజ్యతంత్ర ప్రధానమయిన ఒక 'రాజు' కాని, నిజంగా రాజు కాదనీ బాగా తెలుసు. కాని ఇది ఒక రాజనీతికి, రాజ్యతంత్రానికీ సంబంధించిన 'లా' పాయింటుగా తోచడాన్ని, ఆ సవరణ ఆయన ప్రతిపాదించారు.

అసెంబ్లీలో కొంత తర్జన భర్జన జరిగాక ఓటుకు పెట్టగా, మోతిలాల్‌గారి సవరణ ప్రతిపాదనే 68 ఓట్లు అనుకూలంగా, 62 ఓట్లు ప్రతికూలంగా నెగ్గింది. తాను తీసుకువచ్చిన ఈ సవరణ తీర్మానంతో అసలు లజపతి రాయ్‌గారి ప్రతిపాదన వెనక్కి నెట్టబడుతోందన్న సంగతి మోతీలాల్ గారికి స్ఫురించలేదు.

అసలుకు మోసం

ఆ ప్రకారం కాంగ్రెసువారు, తమ వేలితో తమ కన్నే పొడుచుకున్నట్లు, తమ్ముతామే దగా చేసుకున్నట్లయింది. సెక్రటరీ ఆఫ్ స్టేట్‌చే నామినేట్ చేయబడిన ఇండియన్ లెజ్జస్లేచర్‌కి సంబంధించిన ఇండియన్ మెంబర్లు, వైస్రాయ్‌తో సలహా సంప్రతింపులతోనే నియమింపబడ్డా, వైస్రాయ్‌చే నియమింపబడ లేదన్నట్లు, అంటే "తిట్టుకాదురా కూసు కొడుకా" అన్నట్లు అయి, అసలుకు మోసం చేసుకున్నా రన్నమాట!