పుట:Naajeevitayatrat021599mbp.pdf/377

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాకపట్ల దేశవ్యాప్తంగా నిరసన చూపిస్తూ, ప్రజలు ఆయన రాకను అనుకున్న దానికంటే ఎంతో విజయవంతంగా బహిష్కరించారు.

"చౌరీ చౌరా" దురాగతం కారణంగా గాంధీగారు ఉద్యమాన్నీ నిలుపు చెయ్యకుండా ఉండి ఉంటేనూ, లోలోపల స్వయంపాకాల వల్ల కాంగ్రెసులో చీలికలు రాకుండా ఉండి ఉంటేనూ, దొమినియన్ స్టేటస్ అన్నమాటేమిటి-ఆ 1921లో సంపూర్ణ స్వరాజ్యమే మనకు లభించి ఉండేది. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాక సందర్భంలో దేశవ్యాప్తంగా జరిగిన హర్తాలు, ఆయన రాకను నిరసిస్తూ మనం చేసిన బహిష్కారమూ, వైస్రాయ్ అంతటి వానికే రైలునుంచి బయటికి సామాను మోయడానికి రైల్వే పోర్టర్లు దొరక్కపోయిన తీరూ గమనించిన ఆంగ్లేయులకు-ఇక్కడి వారికి, ఇంగ్లండ్‌లో వారికి కూడా-కనువిప్పయింది. భారత దేశానికి, జాతికి విమోచనకాలం సమీపించింది, వారు స్వాతంత్ర్యానికి అర్హులు అనే నమ్మిక పుట్టుకొచ్చింది. ఆనాటి భారతీయ సమైక్య శక్తి యావత్తు ప్రపంచాన్నీ ఊచి "భేష్-సెహబాస్", అనిపించింది.

భేదోపాయం

జైలునుంచే దాస్-మోతిలాల్ గారలు గాంధీగారిపై తిరుగుబాటు చేసి ఉండకపోతే, మనం కొద్దికాలమైనా ఐకమత్యం ప్రదర్శించగలిగి ఉంటే-పూర్ణ స్వరాజ్య గమ్యం కాకపోయినా, దాని దరిదాపుల్లోకి ఆ 1921-22 సంవత్సరాలలోనే చేరి ఉండేవారం. ఆ నాటి వైస్రాయ్ రీడింగ్ ప్రభువు దేశీయులలోని సంఘీభావానికి విస్తుపోయి, విభ్రాంతుడయి, రాజీ సూచనలనే రొట్టి ముక్కని మాటువేసి, జైలు గోడల మీదుగా విసిరాడు. నిజానికి గాంధీగారి ప్రమేయం లేకుండా ఆ ఇరువురూ ఏమీ చెయ్యరేమో, అసలు చెయ్యలేరేమో అనుకుంటూనే ఆ పన్నుగడ పన్నాడు. అలా అనుకోకుండా విసిరిన ఊహా చాతుర్యపు