పుట:Naajeevitayatrat021599mbp.pdf/364

ఈ పుట ఆమోదించబడ్డది

జైలులో ఉన్నప్పటికీ, ఆయనకు సభా కార్యకలాపాలలో పాల్గొనే హక్కు ఉన్నదని కాంగ్రెసు పార్టీవారి వాదం. ప్రభుత్వంవారు నిర్ణయించే విధానానికి అనుగుణంగా మిత్రాగారు శాసన సభా కార్యక్రమాలలో పాల్గొన గలిగే పర్యంతం సభ వాయిదా పడాలని పార్టీనాయకుడు స్వయంగా ఒక ప్రతిపాదన తీసుకువచ్చాడు. అసెంబ్లీ కార్యక్రమ నాయకుడయిన సర్ అలెగ్జాండర్ మడ్డిమన్ ఆ తీర్మానాన్ని తీవ్రంగా ప్రతిఘటించాడు. మోతిలాల్‌నెహ్రూగారి వాదం చక్కగా, మాంచి హుందాగా, తిరుగులేనిదిగా ఉండి, అలెగ్జాండర్ గారికి సమాధానం చెప్పడానికి మాటలు కరువయాయి. ఆయన తాను లేవదీసిన వాదానికి సిగ్గు చెందడానికి బదులు, ఆంగ్ల దేశంలో హౌస్ ఆఫ్ కామన్స్‌వారు శాసన సభ వారికి ప్రభుత్వాన్ని ఒత్తిడిచేసే హక్కులేదనే ఆచారాన్ని పాటిస్తారు గనుక, ఆ పద్ధతినే ఇక్కడ కూడా పాటించాలని వాదించారు. తర్వాత ఆ ప్రతిపాదన ఓటుకు పెట్టబడింది. అన్నివర్గాల నాయకులూ, ఈ విషయ నిరూపణలో ఉన్న గాంభీర్యానికీ, ఆకర్షణకీ ముగ్దులయి, అనుశ్రుతంగా వస్తూన్న ఆంగ్లేయ ఆచారానికి విరుద్ధంగానూ, తీర్మానానికి అనుకూలంగానూ ఓటు చేశారు. పద్దెనిమిది ఓట్ల ఆధిక్యంతో ఆ ప్రతిపాదన నెగ్గింది. కాని తమకు సభవారి సూచనలను అమలు పరచితీరాలనే అనుశాసనం లేదు. కనుక, ఆ తీర్మానాన్ని అమలు పరచడం తమ విధి కాదంటూ ప్రభుత్వం వారు త్రోసివేశారు.

ఏదో సాకుతో నెగ్గిన తీర్మానాన్ని ప్రభుత్వంవారు త్రోసిపుచ్చినా, కాంగ్రెసువారి కది ఘనమైన విజయమే కదా! అందువల్ల దేశం అంతా ఉల్లాస పూరితం అయింది. ఆరంభంలోనే, ప్రథమ ప్రయత్నంలోనే కాంగ్రెసు వారికి లభించిన ఆ ఘన విజయానికి ఆనందసాగరంలో ఓలలాడింది. కాంగ్రెసుపార్టీ వారు కనబరచిన సంఘీభావానికీ, చూపించిన క్రమశిక్షణకీ ప్రతివారూ ఆశ్చర్య చకితులయ్యారు. నిష్పూచీగానూ, నిరంకుశంగానూ వ్యవహరిస్తూన్న ప్రభుత్వంవారూ, సెక్రటరీ ఆఫ్ స్టేట్ కూడా, ఈ కాంగ్రెసు పార్టీ అన్నది మంచి క్రమ