పుట:Naajeevitayatrat021599mbp.pdf/357

ఈ పుట ఆమోదించబడ్డది

వారు తమ పార్టీ పేరును "కాంగ్రెసు"పార్టీగా మార్చుకుని ఎన్నికలలోకి దిగారో, ఆనాడే చాలామంది కాంగ్రెసేతరులకు తాము కాంగ్రెసుపార్టీలో చేరినట్లయితే చులాగ్గా జయాన్ని సాధించవచ్చుననే నమ్మకం కుదిరింది. కాంగ్రెసు సిద్ధాంతాలలో విశ్వాసంలేని ఎందరో మహానుభావులు సభ్యులుగా ఎన్నికయి, కాంగ్రెసు ఆదేశానుసారం శాసన సభలలో అవలంబించవలసిన విధానాలయందూ కార్యక్రమాలయందూ ఎంతమాత్రమూ నమ్మకం లేకుండానే, కాంగ్రెసుపార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ కారణాలవల్ల పార్టీలో సభ్యులు పెరిగారుగాని వారి గుణగుణాదులు, విధానాలూ ఎంతమాత్రమూ మారలేదు.

కాంగ్రెసువారి పిలుపును మన్నించి వృత్తులను విసర్జించి, సహకార నిరాకరణ ఉద్యమంలో చేరి, అనేక కష్టనష్టాలకు గురి అయి, త్యాగాలుచేసీ, నాయకులైన పెద్దలే స్వరాజ్యపార్టీ స్థాపించి, ఆ పార్టీలో ఉత్తమనాయకులుగా పరిగణింపబడిన ఆ పెద్దలే అధికార వ్యామోహంతో ఏడాదితిరక్కుండానే కాంగ్రెసుకార్యక్రమాదులలో మార్పులు తీసుకువచ్చి బురఖారాయళ్ళ పొత్తుతో ఎలా దిగజారిపోయి, తమ పార్టీకి ఇంకాబలం చేకూర్చుకోవాలనే వాంఛతో అడ్డమయినవారినీ పార్టీలో చేర్చుకుని ఎలా పతనం అయ్యారో గ్రహించడం న్యాయం. నా సలహాను పాటించకుండా, వివిధ కాంగ్రెసు కమిటీల వారికి సకాలంలో సమాచారం అందజేయకుండా, ఆఖరికి సవ్యంగా ఏర్పడిన కాంగ్రెసుపార్టీవారికైనా తెలియజేయకుండా ఒక "బినామీ" మంత్రివర్గాన్ని చెన్నపట్నంలో నిలబెట్టారు.

శాసన సభలో కాంగ్రెసు పక్షం

1927లో ఇంకా కాంగ్రెసు ప్రెసిడెంటుగానే చెలామణీ అవుతూన్న శ్రీనివాసయ్యంగారి ఇంటిలో, ఎన్నికలలో విజయాన్ని చేపట్ట గలిగిన కాంగ్రెసు సభ్యులందరూ హాజరయ్యారు. వారు విశాఖపట్నవాసి సి. వి. ఎస్. నరసింహరాజుగారిని పార్టీనాయకునిగా, ఎస్. సత్యమూర్తిగారిని ఉపనాయకునిగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత శాసనసభా