పుట:Naajeevitayatrat021599mbp.pdf/356

ఈ పుట ఆమోదించబడ్డది

నిరాకరణాదీ ఉద్యమాలయందుగాని ఏ విధమయిన విశ్వాసమూ ఉండి ఉండదనీ, విరోధ భావమే ఉండి ఉండాలనీ అనుకోక తప్పదు. స్వరాజ్య పార్టీపేరుతో వ్యవహరించిన సి. ఆర్. దాస్-మోతిలాల్ నెహ్రూ, శ్రీనివాసయ్యంగారు మొదలైన వారు గాంధీగారి ఉద్యమానికీ, వారి కార్యక్రమానికీ, మొత్తానికి వారి విధానానికే గొడ్డలిపెట్టుగా తమ "కౌన్సిల్ ఎంట్రీ" ప్రోగ్రాం రూపొందగలదన్న విషయం విస్మరించినట్లు గ్రాహ్యం అయింది. కాగా, రాజగోపాలాచారిగారు శాసన సభా బహిష్కార ప్రచారం రెండుమాసాలపాటు విరమించాలంటూ 1923 ఫిబ్రవరిలో తెచ్చిన ప్రతిపాదన, స్వరాజ్యపార్టీ వారివిధానానికే సహకరించింది. న్యాయానికి, అత్యధిక సంఖ్యాకులయిన కాంగ్రెసువారు అనుసరించ దలచిన విధానానికి వ్యతిరేకభావాలు ఉండిఉంటే, వీరు కాంగ్రెసు నుంచి తప్పుకుని తమకు ఇష్టమయిన ఏదో ఒక పేరుతో తమ కార్యక్రమాలు కొనసాగించుకుని ఉండవలసింది. కాని రెండు సంవత్సరాలపాటు వారు పడిన తంటాలలో కాంగ్రెసు సహకరించందే ముందడుగు వేయజాలమనే సంగతి వారికి విశదమైంది. అంతే కాదు, కాంగ్రెసులోనే గనుక వారు ఉండదలిస్తే, వారికి కలిగిన పదవీ వ్యామోహం వారు వదలుకుని ఉండవలసింది. ఇటూ అటూ గాకుండా, హృదయాంతరాళంలో కాంగ్రెసు విధానాలయందు నమ్మికలేకపోయినా, అవసరానికి తప్పని సరిగా కాంగ్రెసు బురఖా తగిలించుకుని నాటకమాడడమే స్వరాజ్యపార్టీ వారి మనోభావం అని తేలిపోయింది.

సర్వసాధారణంగా, ప్రపంచం మొత్తంమీద, "అధికారం" మీద లంచగొండితనపు ఛాయాప్రభావం పడక మానదని ఒప్పుకోక తప్పదు కదా! అందులో మాన్‌ఫర్డ్ రాజ్యాంగ సంస్కరణలను అనుసరించి పదవులు చేపట్టిన నిరంకుశ మంత్రుల చేతులలో లాభాలు పొందాలనీ, హోదాలు సంపాదించాలనీ వాంఛించే కాంగ్రెసే తరులందరూ కాంగ్రెసులో జేరడం సంభవించింది. పాపం, అలా బురఖాలు తగిలించుకున్నవారిలో ఇద్దరో, ముగ్గురో మాత్రమే మంత్రులవడానికి అవకాశం ఉంటుందని వారు తలచారో లేదో గదా! ఎప్పుడయితే స్వరాజ్యపార్టీ