పుట:Naajeevitayatrat021599mbp.pdf/354

ఈ పుట ఆమోదించబడ్డది

చక్రవర్తుల రాజగోపాలాచారిగారికీ, ఎస్. శ్రీనివాసయ్యంగారికి వారి హృదయాలలో మంత్రిపదవులను చేపట్టాలనే వాంఛ ఉన్నా, ఆంధ్రరాష్ట్ర శాసన సభ్యులను సంప్రదించకుండా వారంతట వారే తుది నిర్ణయం తీసుకోలేక పోయారు. అందువలన ఆంధ్రరాష్ట్రీయ కాంగ్రెసు కమిటీ అధ్యక్షునిగా నాతో వారు సంప్రతించవలసి ఉంది. 1927 జనవరిలో శ్రీనివాసయ్యంగారు నన్ను వారి ఇంటికి ఆహ్వానించారు. వారింటివద్దనే రెండు మూడు రోజులపాటు ఈ సంప్రతింపులు జరిగాయి. ఆఖరి రోజున జరిగిన తర్జన భర్జనలు తెల్లవారగట్ల 2, 3 గంటల వరకూ నడిచాయి. నిజానికి అంతగా తర్జన భర్జనలు చేయవలసిన అవసరం ఉందని నేననుకోను. కాని నన్ను వారి ఉద్దేశానికి అనుకూలంగా త్రిప్పుకోవాలనే తాపత్రయంతోటే వారికి కాలం అంతా గడచిపోయింది. ప్రతీసారీ, "కాంగ్రెసువారి ఆశయం అదికాదు"-అన్న వక్క ముక్కతోనే నా అభిప్రాయం తెలిపేవాడిని. లాయరుగా ఆయనకి ఉన్న ప్రతిభా, చాకచక్యమూ వగైరాలన్నీ, పాపం, ఆయన నాపై ప్రయోగించారు. వారిపట్ల నేను కొరకరాని కొయ్యనే అయి ఆఖరు సారిగా మంత్రిపదవులు స్వీకరించడానికి నా సహకారం ఎంత మాత్రం ఉండదని స్పష్టపరిచాను.

వారికి మాత్రం ఎలాగయినా "బినామీ" మంత్రివర్గం యేర్పరచాలనీ, ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తిని ఎన్నుకోవాలనీ చాలా ఉబలాటంగా ఉంది. కాంగ్రెసు వారికి గర్భ విరోధి అనీ, ఆ ఎన్నికలలో కాంగ్రెసువారిని గెలవనీయరాదని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాడనీ ఎరిగిఉన్న వారికి ఆ డాక్టర్ సుబ్బరాయన్ వారికెల్లా నచ్చాడో నా కర్థం కాలేదు. డా. సుబ్బరాయన్ కాంగ్రెసుకు ఎంతగానో ఉపకరిస్తాడు. అందువల్లనే స్వతంత్రపార్టీ అని ఒకదానిని సృష్టించి, దానికి ఆయన్ని నాయకునిగా స్థిరపరచామని శ్రీనివాసయ్యంగారు నాతో చెప్పారు.

నేను తీవ్రంగా ప్రతిఘటించి, నా అసమ్మతిని స్పష్టంచెయ్యడం చేత, అలాంటి చర్య కాంగ్రెసుకు విద్రోహచర్యే అవుతుందని హెచ్చ