పుట:Naajeevitayatrat021599mbp.pdf/352

ఈ పుట ఆమోదించబడ్డది

అమలునందున్న రాజనీతి స్వభావానికి విరుద్దమై ఒక నూతన సంప్రదాయ స్థాపనకు నాంది అనే కారణం వల్లనే వివాదం రేగిందనీ-..........

అందువలన, అఖిల భారత కాంగ్రెసు కమిటీవారు, రాజ్యతంత్ర విధానంలో అవసరమైన మార్పులూ, చేర్పులు చేస్తూ, మన దేశానికి అనువైన పద్ధతిని, ఒక నూతన రాజ్యతంత్ర విధానాన్ని రూపొందించాలనీ తీర్మానించారు.

1927 అక్టోబరు 27 వ తేదీని అఖిల భారత కాంగ్రెసు కమిటీవారు సమావేశపరచిన ఐకమత్య మహాసభవారు సాంఘిక సమస్యను గురించి చేసిన తీర్మానం మదరాసు కాంగ్రెసు (26-12-1927) మహాసభలో ప్రవేశ పెట్టబడి ఆమోదించబడింది. కాగా, ఈ దిగువ ఉదహరించిన అంశాలకు సంబంధించిన తీర్మానాలూ అంగీకరించబడ్డాయి:

1. సైమన్ కమిషన్ "బాయికాట్"కి నిర్ణయం;

2. పండిత జవహర్‌లాల్‌గారి స్వాతంత్ర్య లక్ష్యప్రతిపాదన;

3. స్కీన్ కమిటీనుంచి మోతిలాల్‌నెహ్రూగారు తప్పుకొనుట;

4. మద్రాసు శాసన సభలో కొందరి సభ్యుల అసభ్య ప్రవర్తన.

మదరాసు శాసన సభలో కాంగ్రెసుబలం

ఆంధ్ర, తమిళనాడు, మళయాళ, కన్నడ కాంగ్రెసు శాసన సభ్యులు శాసన సభలో "కాంగ్రెసుపార్టీ"ని స్థాపించడము, అందులో ఆంధ్ర, తమిళనాడు సభ్యులనే ఎక్కువగా కాంగ్రెసు పార్టీ సభ్యులుగా ఎన్నుకోవడమూ జరిగింది. అప్పటి ఎన్నికలలో మదరాసు రాష్ట్ర శాసన సభకు కాంగ్రెసు తరపున 45 గురు ఎన్నిక అయారు. మొత్తం 104 గురు సభ్యులు మాత్రమే కల మద్రాసు అసెంబ్లీలో పెద్దపార్టీ కాంగ్రెసువారిదే. ద్వంద్వ ప్రభుత్వ విధానంలో మంత్రులు ప్రజలకు పూచీదారులన్న విషయం ఒప్పుకోకపోయినా, బాహ్యాడంబరాలూ, ఆనమాయితీలు మాత్రం అమలు పరచారు. గవర్నరుగారు కాంగ్రెసు పార్టీనాయకుణ్ణి పిలిచి, మంత్రివర్గాన్ని ఏర్పరచవలసిందని కోరవలసి ఉంది.