పుట:Naajeevitayatrat021599mbp.pdf/347

ఈ పుట ఆమోదించబడ్డది

తమకు ఏకం కావాలో, తమచే ఎన్నుకోబడ్డ వారిద్వారా దేశానికీ, తమకూ సమకూరవలసిన లాభా లేమిటో తెలియకపోయింది. శాసన సభ్యులు కాంగ్రెసు విధానాన్ని విస్మరించరాదనీ, తమకు కష్టనష్టాలు కలుగచేసే ఏవిధమైన కార్యక్రమాలలోనూ తల దూర్చరాదని చెప్పగల స్తోమతు వారిలో లేకపోయింది. ప్రజల దృక్పథంలో అటువంటి పరిణామమూ, వారిలో ఆ శక్తి కలిగించవలసింది నాయకులే అయినా, శాసన సభ్యులను శాసించగల శక్తి ప్రజలలో లేని కారణంగా, వారు పేలిపోయిన టపాకాయల్లా నిశ్శబ్ధంగానూ, నిర్జీవంగానూ తయారయ్యారు. ద్వంద్వ పరిపాలనపు రాపిడిలో ఇరుక్కున్న మంత్రులు కేవలం దిష్టిబొమ్మల్లా తయారయ్యారు.

ద్వంద్వ ప్రభుత్వ విధానంలోని శాసన సభ్యుల పరిస్థితికీ, 1937 లో ఏర్పడిన కాంగ్రెసు మంత్రివర్గాల పరిస్థితికీ తేడా లేదనే అనాలేమో! నాయకవర్గం నిర్మాణ కార్యక్రమపు టవసరాలనూ, లాభనష్టాలనూ గురించి, 1922 నుంచి ఈ రోజు వరకూ, ఏదో అలసత్వంతోనే వర్తించిందని అనక తప్పదు.

గాంధీగారికి నాప్రశ్న

వార్దాలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు కమిటీ మీటింగునకు అధ్యక్షులవారు అందజేసిన ప్రత్యేక ఆహ్వనంపై నేను వెళ్ళి, ఆ నాటి కార్యనిర్వాహకవర్గ సభలో పాల్గొన్న సందర్భంలో, సభ్యులందరి సమక్షమందూ, మహాత్మా గాంధీగారికి ఈ దిగువ విషయాలు స్పష్టపరిచాను.

"మీరు ఈ దేశానికి స్వాతంత్ర్యం సంపాదించడానికి పాటుపడుతున్నారు. కాని మీరు సఫలత పొంద లేకపోవడానికి కారణం, మీరు మీ కార్యక్రమంలోనూ, మీ యోచనా కౌశ లాదులందూ నమ్మకం లేనటువంటి, మీ నిర్మాణాత్మక విధానమందు విశ్వాసం లేనటువంటి వారితో కలసి పాటుపడడమే కదా?" అని ప్రశ్నించాను.

ఎన్నికలలో అధిక సంఖ్యాకులుగా కాంగ్రెసువారు గెలిచి, శాసన సభాస్థానాలను ఆక్రమించుకొనడం అన్నది కేవలమూ ఒక బూటకమే