పుట:Naajeevitayatrat021599mbp.pdf/345

ఈ పుట ఆమోదించబడ్డది

మ్రోగింపనీయడనీ, ఆయన హిందూ ధర్మ వినాశనకారి అనీ, ఇంగ్లీషు తిండితింటూ, ఇంగ్లీషు వారిలాగే తాను బ్రతుకుతున్నాడనీ ప్రత్యర్థులు ఆయనపై నేరారోపణ జేశారన్నారు. ఇవన్నీ తనపై తీసుకరాబడిన అబద్ధపు ఛార్జీలని తనకు తెలుసు. కాని వాటిని ఖండించడానికి తాను గ్రామాలమ్మట తిరగలేకపోయానన్నారు.

తప్పుడు అంచనా

తాను స్వయంగా ఏ గ్రామానికీ వెళ్ళకపోయినా, గ్రామీణులందరూ ఓటు చేసి తనను గెలిపిస్తారనే తప్పుడు అంచనా వేసుకున్నారాయన. బ్రిటిష్ క్యాబినెట్, సెక్రటరీ ఆఫ్ స్టేట్, రీడింగ్ ప్రభువూ మన ప్రత్యేక ఘనతలనూ, అంతస్తులనూ గ్రహించి దఫదఫాలుగా కోరుతూ ఉన్న మన కోర్కెలను మన్నించి తీరుతారని తలచడం ఎంత పొరపాటో, నియోజక వర్గంలో తిరక్కుండానే, ఓటర్లను కలుసుకోకుండానే, మన పేరు ప్రతిష్టలను గ్రహించి వారి ఓట్లు మన కిస్తారని తలంచడమూ అంత పొరపాటే. గాంధీగారితో వ్యతిరేకించి కాంగ్రెసును చేత పట్టగలిగిన ఈ మేధావులు "పాపం, వారిది బీద దేశం, అక్కడ ఉన్నవారు బలహీనులూ, అర్బకులూ" అని ఆలోచించి, వారి యందు దయాదాక్షిణ్యాలు కలిగి బ్రిటిషువారు ఏవేవో సదుపాయాలూ వగైరాలు చేస్తారని ఎల్లా తలచారో అర్థం కాదు. ప్రజాబాహుళ్యం నాయకులకు అండగా నిలవందే, నాయకులు కోరిన కోర్కెలు మన్నించబడడం జరగదని, 1885-1921 సంవత్సరాల మధ్య జరిగిన అనేక సంఘటనలను విలియా వేసుకుని సంగతి సందర్భాలు మన మితవాద నాయకులు గ్రహించి ఉంటే, కథ అడ్డం తిరిగి, ఆంగ్లేయుల ఆట కట్టయ్యేది. గాంధీగారిని ఓడించి, కాంగ్రెసును తమవశం చేయమని అడగగలిగిన ధీశాలురు, వారి కార్యక్రమ వివరాలను, శాసన సభా ప్రవేశ ఉద్దేశాలను సవ్యంగా ప్రజల ముందు పెట్టి ప్రజా హృదయాన్ని ఆకట్టుకోవలసి ఉంది.

1921 నాటి కాంగ్రెసు పటుత్వం, నిర్మాణ కార్యక్రమం, హిందూ మహమ్మదీయ మైత్రి అనే సూత్రాలమీద నెలకొల్పబడింది,