పుట:Naajeevitayatrat021599mbp.pdf/320

ఈ పుట ఆమోదించబడ్డది

కొలది దినాలలోనే వెళ్ళి విచారణ సాగించిన మాకు మాత్రం, పట్నం మొత్తంమీద ఏకకాలంలో జరిగిన విధ్వంసకపు టేర్పాట్లన్నింటికీ మూల కారణం మ్యునిసిపల్ ఎన్నికలే అన్న దృఢవిశ్వాసం కలిగింది.

కాంగ్రెసు పరపతికి దెబ్బ

ఈ విచారణ ముగిశాక అక్కడే ఒక మీటింగు పెట్టుకుని, కులమతాలతో నిమిత్తం లేకుండా, బాధితుల తక్షణ సహాయార్థం పదివేల రూపాయలు మంజూరు చేశాం. అంతేకాదు, ఆ ధనాన్ని మౌలానా అబ్దుల్‌కలాం అజాదుగారికీ, పండిత మదనమోహనమాలవ్యా గారికీ అందజేయాలనిన్నీ తీర్మానించాం. మేము ముల్తాన్‌లో కొద్ది రోజులు ఉన్నా ఆ ధనం పై వారికి అందజెయ్య బడలేదు. అంతేకాదు, అప్పటికీ యిప్పటికీ కూడా ఆ డబ్బు బాధితులకొరకు లవలేశమూ వినియోగపడలేదు. జమన్‌లాల్ బజాజ్ కోశాధిపతి అయినా, కీలకం రాజగోపాలాచారిగారి చేతులలో ఇరుక్కుంది. 1923 లో నేను వర్కింగు కమిటీ సభ్యత్వం వదులుకునే పర్యంతం నాకూ, రాజగోపాలాచారి గారికీ ఉంటూ వచ్చిన సాన్నిహిత్యం పురస్కరించుకుని, నేను ఆ ధనాన్ని వెంటనే విడుదల చేయవలసిందని స్వయంగా కోరినప్పటికి, దానిని ఆయన మంజూరు చేయలేదు. దాస్-మోతిలాల్ గార్లకూ, గాంధీగారికీ మధ్య 1921 నాటి ఒప్పందాల విషయంలో ఏర్పడిన భేదాభిప్రాయాలను గురించి ఇదివరలోనే చెప్పిఉన్నాను. చిత్తరంజందాస్ గారితోపాటు మౌలానా అబ్దుల్‌కలాం అజాదుగారున్నూ జైలులో ఉన్నారు. మిత్రులు రాజగోపాలాచారిగారు ఎల్లాగయినా అజాదుగారిని నో చేంజర్ వర్గానికి త్రిప్పుకోవాలనే పట్టుదలతో, ఆ యత్నం కొనసాగేదాకా అజాదుగారి చేతికి ఆ డబ్బు యివ్వకూడదని బిగించుకు కూర్చున్నారు. ఆ ప్రయత్నం విఫలమయిన తర్వాతనయినా ఆ ధనం వినియోగపడుతుందని నేను వాంచించాను. కాని నా ఆశ నిరాశే అయింది. అ ప్రకారంగా బాధితుల కివ్వదలచిన ధనరూపక సహాయం పంపకందార్ల చేతులలో కయినా రాకుండానే ఆగిపోయింది. వర్కింగు కమిటీవారి తీర్మానం వమ్మయిపోయి మూలపడింది.