పుట:Naajeevitayatrat021599mbp.pdf/317

ఈ పుట ఆమోదించబడ్డది

రణలోనే ఒక సభ యేర్పాటు జేశాం. స్త్రీల గోడంతా విన్న మాలవ్యాగారు సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. ఆ ఉపన్యాస మధ్యలో ఆయన కళ్ళ వెంబడి ధారాపాతంగా నీళ్ళుకారాయి. హిందువులకు ప్రభుత్వంవారి చేతులలో రక్షణ కలగడం దుర్లభమనీ, మున్ముందు ప్రజలే జట్లు జట్లుగా ఏర్పడి ఆత్మరక్షణ చేసుకోవాలనీ సూచిస్తూ, హింసను హింసతోనే ఎదుర్కొని అయినా ఆత్మరక్షణ చేసుకోవాలనీ, బలవంతంగా మతం మార్చుకోవలసిన కుటుంబాలవారు "శుద్ధి" క్రియతో తిరిగీ హిందూ మతంలో పూర్వస్థానాలు పొంది, ఆయా కులలాకే చెందేలాగున చేయాలనీ ఉద్ఘాటించారు. అటువంటి పరిస్థితులలో ఆ ప్రకారంగా శుద్ధి అన్నది కాంగ్రెసువారి ప్రాపకంలో బలం చేకూర్చుకుంది.

సహజీవన సౌభాగ్యం

వార్తాపత్రికలలో ప్రచురించబడిన వార్తలనుబట్టి "రంజాం" పండుగ సందర్భంగా ఏర్పాటయిన ఉత్సవాలమీద రాళ్ళు పడడంతో యీ రగడంతా ఆరంభం అయినట్లు కనబడుతుంది. వార్తలలోని నిజానిజాలు గ్రహించాలనే తలంపుతో మున్ముందుగా యీ గలాటాకు పూర్వం హిందూ మహమ్మదీయ ప్రజల మధ్య సామరస్యం ఏ తీరున ఉంది అనే విషయం గ్రహించాలని తలచాము. పరిస్థితులు అనుకూలించినప్పుడు సేకరించిన సమాచారమంతా సమగ్రంగా నా "స్వరాజ్య" పత్రికలో ప్రచురిద్దాం అనే ఉద్దేశంతో వివరంగా తెలియవచ్చిన వార్తలూ, గ్రహించగలిగిన సత్యాలూ వ్రాసుకున్నాను. అచ్చట హిందూ మహమ్మదీయుల మధ్యమైత్రి చాలా మంచి స్థాయిలోనే ఉండేది అన్న గట్టి నమ్మకం మా కందరికీ కలిగింది.

ఒక మసీదుకూ, ప్రఖ్యాత ప్రహ్లాద దేవలయానికీ మధ్య సరిహద్దుగా ఒక మామూలు గోడ మాత్రమే ఉంధనీ, మసీదులోని ప్రార్థనలూ, ఆలయంలోని అర్చనలూ అంతరాయాలు లేకుండా యుగయుగాలుగా సాగుతూ వచ్చాయనీ గ్రహించాం. ప్రహ్లాదుని జన్మస్థానం ముల్తాన్. అచ్చటి ప్రహ్లాద ఆలయం చాలా పురాతన మయినదే. ఆ