ఈ పుట ఆమోదించబడ్డది

పూర్వగాధ

పిల్లలని ఏడిపించడం, వాళ్ళ పుస్తకాలు పారవెయ్యడం, ఉపాధ్యాయుల్ని వుడికించడం మొదలైన ఘనకార్యాలు!

ఒకసారి పుదూరు సుబ్రణ్యయ్యరు అనే మాష్టరుగారు బోర్డువైపు తిరిగి లెఖ్ఖలు చెబుతూ వుండగా నేను వేళ్ళాడుతూ వున్న ఆయన గోచీ కుర్చీకి కట్టాను. దాంతో బెత్తాల దెబ్బలు, మొట్టికాయలు మొదలయిన శిక్షలన్నీ సంపాదించాను! అంతే కాదు! నన్ను స్కూలు లోంచి డిస్మిస్ చేశారు. ఈ సంగతి మా నాయనగారికి తెలిసి, ఆయన ఆ రోజుల్లో అక్కడ డిప్యూటీకలెక్టరుగా వుండే అడక్కి నారాయణ రావుగారి నాశ్రయించగా, ఆయన దయ వల్ల మళ్ళీ స్కూల్లో ప్రవేశించాను.

కాని మరికొద్ది రోజులకే ఇంకొక తవ్వాయి వచ్చింది. అప్పట్లో అల్లాడి ఆదెయ్య కొడుకు సూర్యనారాయణ అప్పర్ మిడిల్ క్లాసు చదువుతూ ఉండేవాడు. అతను నన్నేదో తిరస్కారంగా మాట్లాడి కొట్టేసరికి, నేను అతని ఇంగ్లీషు టెక్స్టు పుస్తకం ఎత్తుకుపోయి సువర్ణముఖి నది ఒడ్డున ముక్కలు ముక్కలుగా చింపివేశాను. ఆ చింపడం నా వెనకాలే ఉన్న యానాది వాడొకడు చూసి, నేను చింపి పారవేసిన కాగితం ముక్కలన్నీ తెచ్చి నా వెనకాలే స్కూల్లో అప్పజెప్పాడు. దాని ఫలితంగా నాకు మళ్ళీ బెత్తం ప్రహరణాలు జరిగించి, డిస్మిస్ చేశారు. తిరిగి ఆ డిప్యూటీ కలెక్టర్ మూలంగానే ఆ స్కూల్లో పునఃప్రవేశం లభించింది.

ఈ సారి ఆయన నన్ను ఇంటికి పిలిపించి, "ఎందు కల్లాంటి తప్పుపని చేశా?" వని అడిగారు. నేను నిర్భయంగా వున్నది వున్నట్లు చెప్పాను. ఆ క్రితం రోజున అతను నన్ను కొట్టాడనీ, అతను నాకన్న పెద్దవాడవడం చేత మళ్ళీ కొట్టలేననీ, కాబట్టి పగ తీర్చుకోవడానికి ఈ పని చేశాననీ చెప్పాను. దాంతో ఆయన మందలించి మళ్ళీ స్కూల్లో ప్రవేశపెట్టాడు. నాకు ఒకవంక ఇల్లాంటి అల్లరి స్నేహాలున్నా, రెండోవంక పెద్దవాళ్ళతో స్నేహాలు కూడా వుండేవి. అప్పుడు నరసింహరాజు అనే ఒకాయన బి.ఏ చదువుతూ వుండే